covid: కొత్త వేరియంట్‌తో జాగ్ర‌త్త‌!

vijayawada: కరోనా(covid) కొత్త వేరియంట్‌(new variant) భారత్‌(india)లో ఆందోళనలు సృష్టిస్తోంది. రోజుకి పది వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొందరు కొత్త వేరియంట్‌ ప్రమాదకరం కాదని చెబుతున్నా.. మరికొందరు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్-19 కొత్త వేరియంట్ ఆర్క్‌చురస్ (XBB.1.16) ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది.

కరోనా కొత్త రూపాంతరాన్ని తేలికగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ప్రమాదమని చెబుతున్నారు. ఆర్క్‌చురస్ (XBB.1.16) భారతదేశంతో పాటు..ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోకి వ్యాపించిందన్నారు. ఇది ఓమిక్రాన్ కంటే ప్రమాదకరమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆర్క్ చురస్ స్పైక్ ప్రోటీన్ కారణంగా వేగంగా ప్రజలకు సోకుతుందన్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ ఆర్క్‌చురస్ (XBB.1.16) ఇప్పటివరకు 22 కంటే ఎక్కువ దేశాలలో ఉన్నట్లు వార్విక్ యూనివర్సిటీ వైరాలజీ నిపుణుడు ప్రొఫెసర్ లారెన్స్ యంగ్ తెలిపారు. దీని సైడ్ ఎఫెక్ట్స్ చూడనంత వరకు సీరియస్ నెస్ అర్థం చేసుకోవడం కష్టమన్నారు.

కొవిడ్-19 కొత్త వేరియంట్‍ ఆర్క్‌చురస్ (XBB.1.16)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల చిన్నారుల్లో ఈ లక్షణాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాతో పాటు మరిన్ని దేశాల్లో ఈ వేరియంట్ వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని WHO వెల్లడించింది. ఈ వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

వైరస్‌ లక్షణాలు ఇలా..
ఆర్క్‌చురస్ (XBB.1.16) వేరియంట్ సోకిన వారిలో అధిక జ్వరం, దగ్గు, కళ్లు దురదగా ఉండి ఎర్రబడడం లేదా కండ్లకలక లక్షణాలు కనిపిస్తాయి. ఈ వేరియంట్‍లో కళ్లకు సంబంధించి లక్షణాలు విభిన్నంగా ఉండనున్నాయి.