200 కోట్ల స్కాం.. ఆ హీరోయిన్‌ను కాపాడుతున్నాడు!
బాలీవుడ్‌లో గత ఏడాది బయటపడ్డ రూ.200 కోట్ల స్కాం గురించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్ పేరు బయటికి రాకుండా, ఆమెకు అసలు కేసుతో సంబంధం లేదని అంటున్నాడు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్. కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్.. ఇటీవల జరిగిన పోలీసు విచారణలో మరో కథ అల్లేందుకు ప్రయత్నించాడు. జాక్వెలీన్‌తో కొన్ని నెలల పాటు ప్రేమలో ఉన్న సుఖేష్ ఇప్పుడు ఆమెను ఈ కేసు నుంచి రక్షించేందుకు చూస్తున్నాడు. నిన్న సుఖేష్‌ను దిల్లీలోని పటియాలా కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా న్యాయస్థానంలో సుఖేష్ మాట్లాడుతూ.. తాను చేసిన రూ.200 కోట్ల్ స్కాంకు జాక్వెలీన్‌ను అసలు సంబంధంలేదని అన్నాడు. అంతేకాదు ఈ విషయంలో అసలు జాక్వెలీన్ భయపడాల్సిన అవసరం లేదని, ఆమెకు ఏమీ కాకుండా తాను రక్షిస్తానని తెలిపాడు. అంతేకాదు.. కోర్టు నుంచి మళ్లీ జైలుకు తరలిస్తుండగా.. జాక్వెలీన్‌కు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలపాలని మీడియాను కోరాడు. దీని బట్టి చూస్తే అతను ఇంకా జాక్వెలీన్‌తో ప్రేమను కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇంతకీ ఎవరీ సుఖేష్…
సుఖేష్ జీవితమే ఒక నేరాల పుట్ట. సుఖేష్ బెంగళూరుకు చెందిన ఓ రబ్బర్ కాంట్రాక్టర్ కుమారుడు. పదో తరగతిలోనే చదువు మానేసి నేరాల బాటపడ్డాడు. 2006లో ఎన్నో నేరాలకు పాల్పడ్డాడు. 2017లో ఓ వృద్ధుడిని పరిచయం చేసుకుని, తాను కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడినని చెప్పి మోసం చేసి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేసి పారిపోయాడు. ఆ డబ్బుతో విల్లా, ఖరీదైన కార్లు, వాచీలు కొనుగోలు చేసాడు. ఆ తర్వాత 17 ఏళ్ల వయసులోనే కారు డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ కోసం ఏకంగా పోలీస్ కమీషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసేసాడు. ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకుంటూ.. తమిళనాడుకు చెందిన పెద్ద పెద్ద నేతల కుమారుడు,మనవడిని అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు.
బాలీవుడ్ హీరోయిన్లకు ఎర వేసి..
జాక్వెలీన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి వంటి పాపులర్ హీరోయిన్లకు ఎర వేసి వారిని కూడా మోసం చేసాడు సుఖేష్. కాకపోతే వారి నుంచి ఏమీ వసూలు చేయలేదు కానీ వారికి డబ్బు, కార్లు, ఇళ్ల ఆశ చూపి ముగ్గులోకి దింపాడు. తాను సన్ టీవీ ఓనర్‌ని అని జాక్వెలీన్‌ను నమ్మించి సౌత్ ఇండస్ట్రీలో తాను వరుసగా సినిమాలు తీయాలనుకుంటున్నానని, అన్నింటిలోనూ తప్పకుండా ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దాంతో జాక్వెలీన్, నోరా ఫతేహి అతని మాయమాటలు నమ్మేసారు. నోరాకు కేవలం డబ్బు ఆశ చూపాడే కానీ.. జాక్వెలీన్‌ను మాత్రం ఇష్టపడ్డాడు. అలా ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. వారి పర్సనల్ ఫొటోలు కూడా బయటికి రావడంతో బాలీవుడ్‌లో దుమారం రేగింది. జాక్వెలీన్ సుఖేష్‌ను వివాహం కూడా చేసుకోవాలనుకుంది. అతను మోసగాడు అని తెలిసిన తర్వాత హీరోయిన్లు ఇద్దరూ షాకయ్యారు. ఈ కేసులో వారికి కోర్టు పలుసార్లు సమన్లు కూడా జారీ చేసింది.
ఏంటీ 200 కోట్ల స్కాం?
ఈ 200 కోట్ల మోసానికి పాల్పడే సమయంలో సుఖేష్ పలు సెక్షన్ల కింద బుక్కయ్యి జైలులో ఉన్నాడు. అయినా కూడా అతను ఖాళీగా కూర్చోలేదు. తన మాస్టర్ మైండ్‌లో ఈసారి భారీ మోసానికి పాల్పడ్డాడు. 2020 జూన్ నుంచి 2021 వరకు జైలులోనే ఉంటూ ఫోన్లు, వాయిస్ మాడ్యులర్‌ను వినియోగిస్తూ.. రాన్‌బాక్సీ మాజీ యజమాని శివీందర్ సింగ్ భార్య అదితి సింగ్‌కు ఫోన్లు చేసాడు. అప్పటికే శివీందర్ సింగ్ ఓ కేసులో జైలులో ఉన్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తానని, తాను లా సెక్రటరీ అనూప్ కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. శివీందర్ సింగ్‌ను బయటికి తీసుకురావడానికి రూ.200 కోట్లు కావాలని అడిగాడు. అతను నిజంగానే లా సెక్రటరీ అనుకుని మోసపోయిన అదితి సింగ్ అడిగిన మొత్తం అప్పజెప్పింది. డబ్బు ఇచ్చిన తర్వాత కూడా తన భర్త జైలు నుంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా సుఖేష్ మోసాలు బయటపడ్డాయి. దాంతో సుఖేష్‌తో సంబంధాలున్న జాక్వెలీన్, నోరా ఫతేహిల పేర్లు కూడా బయటపడ్డాయి.