ధాన్యం కొనుగోలుకు ఏడు వేల కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం వెంటనే ఏడు వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వాటిని యుద్ధప్రాతిపదికన అమల్లోకి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ అనిల్‌కుమార్‌లను ఆయన ఆదేశించారు. ప్రగతిభవన్‌లో సీఎంవో అధికారులతో ఆయన సమావేశమై ఈ అంశంపై చర్చించారు. వరి కోతలు మొదలై ధాన్యం ఇళ్లకు చేరుతోందని సీఎంకు వ్యవసాయాధికారులు నివేదించారు. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. గత సీజన్‌లో మాదిరిగానే ఏడు వేల కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కార్యాచరణ చేపట్టాలని సీఎస్‌కు ఆయన సూచించారు.

పంట నష్టపోయిన రైతులకు సాయం..
ఇటీవల కురిసన వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ.10వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక ఇవాళ నిర్వహించే సమావేశాంలో నష్ట పరిహారం ఇచ్చే విషయంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం నిర్మాణం తర్వాత ఇప్పటికే తెలంగాణలో రెండో పంటగా వరి సాగు చేయడం రైతులు ప్రారంభించారు. ప్రస్తుతం చాలా చోట్ల పంట కోత దశకు చేరుకుంది. ఈక్రమలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతోపాటు వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు రూ.10 ఇచ్చే కార్యక్రమంపై చర్చిస్తారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి.