FOXCONNతో కేసీఆర్ ఒప్పందం
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్‌కు చెందిన ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో ఎంవోయూ చేసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హాన్ హై ఫాక్స్ కాన్’ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పెట్టుబడులకు సంబంధించి చర్యలు జరిగాయి. అనంతరం హాన్ హై ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు అంగీకరించడంతో చర్చలు ఫలించాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా.. సుమారు లక్ష మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని చెబుతున్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వొకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని.. ఈ ఘనతను తెలంగాణ ప్రభుత్వం సాధించినట్లు పలువురు పేర్కొన్నారు.
ఫాక్స్ కాన్ కంపెనీ అధినేత యంగ్ ల్యూ పుట్టిన రోజు కూడా గురువారం కావడం విశేషం. ఈ సందర్బంగా ఆయనకు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సిఎం కేసీఆర్ స్వయంగా యాంగ్ లీ కి అందజేశారు. ఈ సమావేశం అనంతరం.. ప్రగతి భవన్ లో యంగ్ ల్యూ ప్రతినిథి బృందానికి మధ్యాహ్న భోజనంతో సిఎం కేసీఆర్ ఆతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో… రాష్ట్ర ఐటి మురియు పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కెటి రామారావు, వైద్యారోగ్యం, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి .. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపీ అంజనీ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.