ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ.. ఐప్యాక్ నివేదిక ఆధారంగానే!
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం 151 మంది ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సందర్బంగా ఆయన గడప గడపకు మన ప్రభుత్వంపై సమీక్ష నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతోపాటు నియోజకవర్గ సమన్వయకర్తలు, రీజినల్ కో-ఆర్డినేటర్లు పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కీలక నాయకులతో సీఎం జగన్ భేటీ అవుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు గత కొన్ని రోజులుగా మంత్రి వర్గంలోకి కొత్తవారిని తీసుకుంటారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిని కేబినెట్ ఉంచుతారు.. ఎవరిని తీసేస్తారు.. అన్నదానిపై ఇవాళ జరిగే సమావేశంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం అసంతృప్తి..
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం సూచన మేరకు.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీసుకొచ్చారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రోజు ఎమ్మెల్యేలు గడప గడపు తిరుగుతూ.. ప్రభుత్వం అందించిన సంక్షేమం గురించి వారికి వివరించడంతోపాటు, ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సీఎం పెట్టుకున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు రోజుకి 4 నుంచి 6 గంటల వరకు రోజుకో గ్రామానికి వెళ్లి ప్రతి ఒక్కరినీ పలకరించి రావాలి. దీంతోపాటు పల్లె నిద్ర లాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యేలు చేపట్టాల్సి ఉంది. అయితే గడప గడపకు కార్యక్రమాన్ని కొందరు లైట్‌గా తీసుకున్నారు. వారికి ఇది వరకే వార్నింగ్ ఇచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఐప్యాక్ టీం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును ఆయన వివరించనున్నారు. ఈ జరిగే సమావేశంలో ఎమ్మెల్యేల లోపాలను వారికి సీఎం జగన్ వివరిస్తారని.. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలో దిశానిర్ధేశం చేస్తారని సమాచారం. మరోవైపు గత కొద్ది రోజులుగా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వార్తలు వస్తున్నాయి. వీటిపై కూడా ఎమ్మెల్యేలకు స్పష్టమైన సంకేతం ఇవ్వనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత..
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. కొందరు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ ఇస్తారు అనే చర్చ సాగుతోంది.. గతంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. మరోవైపు.. మంత్రివర్గంలో మార్పులు తప్పవనే ప్రచారం నేపథ్యంలో.. ఈ సమావేశంలోనే.. వారికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కోల్పోవడంతో.. ఆ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు, నేతలకు టెన్షన్ పట్టుకున్నట్టు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే మంత్రి వర్గ విస్తరణ మాత్రం కచ్చితంగా ఉంటుందని.. ఎమ్మెల్సీ కోట కింద గెలిచిన ఇద్దరు ముగ్గురు కొత్తవారిని మంత్రి వర్గంలో చోటు కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం.