జులై నుంచి విశాఖ కేంద్రంగా పాలన – సీఎం జగన్‌

ఏపీ కేబినెట్ భేటీలో సీఎం జగన్, మంత్రులతో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా రాజధాని అంశాన్ని ఆయన మరోసారి లేవనెత్తారు. జులై నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని సీఎం జగన్ మంత్రులకు చెప్పారు. ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ఉంటుందని.. జగన్‌, ఇతర మంత్రులు చెప్పగా.. సుప్రీంకోర్టులో అమరావతి రాజధాని అంశంపై విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ తీర్పు వెలువడేందుకు మరికొంత సమయం పట్టనున్న తరుణంలో జులై నెల అయితే బాగుంటుందని సీఎం జగన్‌ భావించినట్లు సమాచారం. మరోవైపు కోర్టు చిక్కులపై కూడా ఈ లోపు క్లారిటీ వస్తుందని అందరూ భావిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు దిశానిర్దేశం..
సుమారు వారం పాటు జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై కేబినెట్‌ మంత్రులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది కాలం వ్యవధి మాత్రమే ఉండటంతో ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజలకు జరిగిన మంచి గురించి, సంక్షేమ పథకాల లబ్దిని అందరికీ తెలిసేలా సమావేశాల్లో ప్రసంగించాలని సూచించారు. ఈక్రమంలో కొందరు మంత్రుల పనితీరు, వ్యవహారశైలి సరిగా లేదని మందలించినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులను మార్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి తెలియవస్తోంది. ప్రతి మంత్రి పనితీరుపై దృష్టి సారించాలమని తేడా వస్తే… పదవుల నుంచి తొలగిస్తామని జగన్‌ సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం.

ఎమ్మెల్సీలను గెలిపించుకోవాలి..
ఈ నెల 23న నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. ఒక్కో మంత్రి ఆరుగురు ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ.. వారితో ఓటు వేసే బాధ్యతలు తీసుకోవాలన్నారు. బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉండాలని మంత్రులను ఆదేశించారు.