జగన్ భజన చేసి గవర్నర్ స్థాయి తగ్గించారు – పయ్యావుల కేశవ్ ఫైర్
కొత్త గవర్నర్ చేత అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ భజన చేయించుకుని ఆయన స్థాయిని తగ్గించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పలు వేదికల్లో విశాఖపట్నం త్వరలో రాజధాని కాబోతోందని చెప్పిందని.. అలాంటిది ఇవాళ జరిగిన గవర్నర్ ప్రసంగంలో రాజధాని అంశం ఎందుకు చేర్చలేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని… ప్రస్తుత గవర్నర్ స్థాయి తగ్గించారని ఆయన విమర్శించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రిని పొగిడించుకోవడం ఏంటో తనకు అర్థం కాలేదని.. మండిపడ్డారు. రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా అని ప్రశ్నించారు. ప్రథమ పౌరుడితో సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి రాక కోసం గవర్నర్‌ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారని అన్నారు. ఇది సభా నిభంధనలకు విరుద్ధమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతులు క్షీణించాయని.. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్‌తో చెప్పించే యత్నం చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్‌తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు.
పేర్ని వర్సెస్ పయ్యావుల..
అసెంబ్లీ సమావేశాలకు ముందు.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మచిలీపట్నం ఎమ్మెల్సీ పేర్ని నాని మధ్య చిన్న మాటామంతి జరిగింది. తొలుత ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈనేపథ్యంలో వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అది కాస్త మాటల యుద్ధం వరకు వెళ్లింది. నవ్వుకుంటూనే ఇద్దరూ పరోక్ష కౌంటర్‌లు విసురుకున్నారు. కేశవ్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నానని పేర్ని నాని చెబుతూనే.. ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న సెంటిమెంటును నాని గుర్తు చేశారు. దీనికి ప్రతి స్పందించిన పయ్యావుల.. సందేహం ఏమీ వద్దు 1994 ఫలితాలు.. 2024లో రిపీట్ అవుతాయని నానికి చెప్పారు. 1994లో ఉరవకొండలో టీడీపీ గెలవగా.. అదేవిధంగా రాష్ట్రంలోనూ అప్పట్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.