ఏపీ సీఎం జగన్‌లో మార్పు.. ఎమ్మెల్యేలు షాక్!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం (ఏప్రిల్ 3న) సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీనికి ముందు… ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో వైసీపీ ఓటమి చెందడం… కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం గుర్రుగా ఉన్నారని.. కొందరిని మంత్రి పదవి నుంచి తప్పిస్తారని, పనితీరు సరిగాలేని ఎమ్మెల్యేలను మందలిస్తారని వార్తలు వచ్చాయి. అయితే… ఈసారి మాత్రం అందరూ ఊహించిన దానికి భిన్నంగా జగన్ ప్రసంగం సాగింది. రాజకీయాలు అంటే మానవ సంబంధాలు అని.. అవి తన తండ్రి నుంచి నేర్చుకున్నానని.. రానున్న ఎన్నికల్లో ఏ ఎమ్మెల్యేని, కార్యకర్తను వదులుకోనని చెప్పి అందరినీ సీఎం జగన్ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు అందరూ తమ పనితీరుపై సీఎం వద్ద నివేదికలు సిద్దంగా ఉన్నాయని.. దీనిపై మాట్లాడి మందలిస్తారని మీటింగ్‌కు ముందు కొందరు ఆందోళన చెందారు. కానీ అలాంటిది ఏదీ జరగలేదు. దీని వెనుక బలమైన కారణం కూడా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా… సీట్లు ఇచ్చేది లేదు అనే విషయం ముందుగానే వైసీపీ ఎమ్మెల్యేకు చెప్పడం వల్ల పార్టీకి డ్యామేజి జరుగుతోందని జగన్ గ్రహించారు. మరోవైపు పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోవడం కూడా కొంత జగన్ సార్ స్వరం మార్చి మాట్లాడారని అందరూ అనుకుంటున్నారు.
గతంలో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు..
ఈ ఏడాది ఫిబ్రవరి 13న జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తూ కొందరికి డైరెక్టుగా.. మరి కొందరికి పర్సనల్‌గా క్లాసులు పీకారు. ఇది మొదటి హెచ్చరిక అని.. మరోసారి ఇదేవిధంగా పనిచేస్తే టికెట్టు ఇచ్చేది లేదని గట్టిగా చెప్పారు. ఈ సందర్బంగా ఆయన పేర్లు ప్రస్తావించి… ఒక్కో ఎమ్మెల్యే ఎన్నిరోజులు గడప గడపకు తిరగారు.. ఎంతసేపు ప్రజల మధ్య ఉన్నారు.. పనితీరు ఏవిధంగా ఉంది అని ఎమ్మెల్యేల పనితీరు నివేదికను డిజిటల్ స్క్రీన్‌పై ప్రెజంటేషన్ రూపంలో చూపించారు. కానీ ఈ సారి సీఎం అలా చేయలేదు.
*బటన్ నొక్కడం నా పని.. తిరగడం మీ పని*..
నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం జగన్ ఇలా మాట్లాడారు.. ‘నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను. మిమ్మల్ని పిలిపించి ఇంతగా ఎందుకు చెబుతున్నానంటే.. దీనికి కారణం… మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ అడుగులు వేస్తున్నాం. మనం సరైన పద్దతుల్లో పనిచేయక, ప్రజల్లో గ్రాఫ్ పడిపోతే.. పార్టీకి నష్టం వాటిల్లుతుంది. అందుకే గ్రాఫ్ పెంచుకోవాలి. బటన్ నొక్కడం నేను చేయాల్సిన పని, ప్రజల్లో తిరగడం మీ పని.. ఈ రెండు సమన్వయంతో జరిగితే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 గెలుస్తామని’ జగన్ తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఏమేరకు మంచి జరిగింది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. సామాజిక మాధ్యమాలను విరివిగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ నెల 7న జగనన్నే మన భవిష్యత్తు, 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు ఉన్నాయని వాటిని ఎమ్మెల్యేలు దగ్గరుండి పరిశీలించాలని జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల అమలులో ఎక్కడా జాప్యం జరగడానికి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.