ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్‌.. ప్రధాని మోదీతో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ నెలలో సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ వెళ్లడం ఇది రెండోసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే సోమవారం జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. గవర్నర్‌తో భేటీ వెంటనే సీఎం ఢిల్లీ పర్యటన ఖరారు కావడం ఆసక్తిగా మారింది. ఈ నెల 17వ తేదీన సీఎమ్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రధానితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చేపట్టనున్న పర్యటనలోనూ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవనున్నట్లు సమాచారం. ప్రధానితో పాటు.. పలుశాఖల మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీడీపీ ఆరోపణలు ఇలా..
కడప్‌ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని వివేకా హత్య కేసులో నుంచి తప్పించేందుకు సీఎం జగన్‌ వరుసగా ఢిల్లీకి వెళ్తున్నారని ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో భాగస్వామి అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు అమరావతి రాజధాని అంశంపై కేంద్ర వైఖరి వ్యతిరేకంగా ఉండటం కూడా కొంత సమస్యగా ఏర్పడింది. ఈనేపథ్యంలో మరోసారి ప్రధాని మోదీని కలిసి ఆయా అంశాలపై చర్చించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు తెలంగాణతోపాటు ఈ ఏడాదే ఏపీలో కూడా ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది.

ఇక మంగళవారం సాయంత్రం విశాఖపట్నంలో జరుగుతున్న జీ20 సదస్సులో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఈ సందర్బంగా జీ20 దేశాల ప్రతినిధులతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. విదేశీ ప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో కూడా సీఎం పాల్గొన్నారు. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ప్రతినిధులకు సీఎం వివరించారు.