వాహనం నుంచి డబ్బులు చల్లిన సీఎం అభ్యర్థి
కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. ఇవాళ్టి నుంచే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ స్పష్టం చేసింది. ఈక్రమంలో వివిధ పార్టీల నాయకులు ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తూ, ఓటు వేయాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ భావిస్తున్న నాయకుడు మంగళవారం నిర్వహించిన ఓ రోడో షోలో జనాలపై కరెన్సీ నోట్లు చల్లి వివాదాల్లో చిక్కుకున్నారు. మాండ్య జిల్లాలోని బే వినహళ్లిలో ప్రచారం చేస్తున్న ఆయన .. తన ప్రచార రథంపై నుంచి రూ.500 నోట్లను ప్రజలపై చల్లుతున్న వీడియోను పలువురు రికార్డు చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ‘ప్రజా ధ్వని’ పేరుతో గత కొన్ని రోజులుగా శివకుమార్ యాత్ర చేస్తున్నారు… ఈక్రమంలో ఆయన సరదాగా డబ్బులు చల్లారా.. లేదా ఓట్ల కోసం ఇలా చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.కాంగ్రెస్ రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా కింద 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న శివకుమార్ బహిరంగంగా డబ్బులు విసిరి వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ వీడియోపై పార్టీ అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. శక్తిమంతమైన వొక్కలిగ సామాజికవర్గానికి కంచుకోటగా భావించే మాండ్యలో ఆయన ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.