నెలరోజుల్లో వివేకా హత్య కేసు క్లోజ్ చేయండి.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందని ముందు నుంచే సుప్రీంకోర్టు సీబీఐని హెచ్చరిస్తూ వస్తోంది. ఈక్రమంలో ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఈ కేసు విచారణలో ఉండగా.. సీబీఐ అధికారి రాంసింగ్ పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. అయితే.. ఇక్కడ కూడా దర్యాప్తులో వేగం లేకపోవడంతో తక్షణమే అధికారిని మార్చాలని సీబీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న రాంసింగ్‌ను సీబీఐ పక్కన పెట్టింది. అంతేకాకుండా ఏప్రిల్ 30వ తేదీ నాటికి వివేకా హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లో తేల్చాలని సీబీఐకి సుప్రీం ధర్మాసనం స్ఫష్టం చేసింది.
కేసు ఛేదనలో సీబీఐ కొత్త టీం వీళ్లే..
వివేకా హత్య కేసు ఛేదించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. కొత్త టీంను సీబీఐ ఏర్పాటు చేసింది. ఈ టీంను డీఐజీ చౌరాసియా లీడ్ చేయనున్నారు. ఇక గ్రూప్ సభ్యులుగా ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ శ్రీమతి, నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది. వీరందరికి వివేక హత్య కేసును నెల రోజుల్లో క్లోజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 30 లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. ఇది ఇలా ఉండగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆలస్యమవుతోందని వివేక హత్య కేసులో ఐదో నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. విచారణ ఆలస్యమవుతున్నందున తన భర్తకు బెయిల్ ఇవ్వాలని లేదా దర్యాప్తు అధికారి రామ్‌సింగ్‌ను మార్చాలంటూ ఆమె పిటిషన్‌లో కోరారు. వీటిని పరిశీలించిన సుప్రీంకోర్టు సీబీఐకి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సీబీఐ అధికారులను మార్చాలని,,, కొత్త టీంను నియమించి నిందితులను గుర్తించాలని ధర్మాసనం సూచించింది. అయితే.. ఈ కేసు దర్యాప్తు ఆలస్యమవుతున్న వేళ తన భర్త శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని తులసమ్మ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.
ఇటీవల సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..
వివేకా హత్య కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. సుప్రీంకోర్టు రెండు రోజుల కిందట ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటర్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేనప్పుడు ఈకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిని ఎందుకు మార్చకూడదో చెప్పాలని కోర్టు అడిగింది. దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని సీబీఐ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈక్రమంలో బుధవారం మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సీబీఐ అధికారులను మార్చాలని కోర్టు ఆదేశించింది.