చిరు 2 లక్షలు ఇస్తారనుకున్నా కానీ.. ఎమోషనల్ అయిన నటుడు పొన్నాంబళం
మెగాస్టార్ చిరంజీవి సిల్వర్ స్క్రీన్ మీదే కాదు.. నిజజీవితంలోనూ మెగాస్టార్ అని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. అందుకు ఆయన చేసిన ఎన్నో సహాయాలే నిదర్శనం. నటీనటులు ఎవరైనా డబ్బులేక చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసినవెంటనే ఆయన తక్షిణం సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇటీవల కాలంలో ప్రముఖ తమిళ నటుడు పొన్నాబళంకు చిరు సాయం చేసారు. కొన్ని నెలలుగా పొన్నాంబళం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు డబ్బులు కూడా లేకపోవడంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం చిరంజీవికి తెలీడంతో 2, 3 లక్షల వరకు సహాయం చేస్తారేమో అని పొన్నాంబళం అనుకున్నారట. కానీ చిరంజీవి ఆయనకు ఫోన్ చేసి అపోలో హాస్పిటల్‌లో చేరాలని సూచించారు. చెన్నై నుంచి హైదరాబాద్ రాలేని పరిస్థితిలో ఉన్నానని పొన్నాంబళం చెప్పగా.. చెన్నైలో ఉన్న అపోలోలోనే చేరమని చెప్పారట. వెంటనే పొన్నాంబళంను అపోలోలో చేర్పించగా.. అక్కడివారు జాయినింగ్ ఫీస్ కూడా తీసుకోకుండా వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. అయితే.. పొన్నాంబళం పూర్తిగా కోలుకున్నాక తెలిసిన విషయం ఏంటంటే.. చికిత్సకు దాదాపు 45 లక్షల వరకు అయ్యాయని మొత్తం ఖర్చు చిరంజీవినే పెట్టుకున్నారట. హాస్పిటల్ వారిదే కావడంతో తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని పొన్నాంబళం ఓ సందర్భంలో మీడియాతో పంచుకున్నారు.