ఆ CBI అధికారిని మార్చండి.. వివేకా హత్య కేసు విచారణపై సుప్రీం ఆగ్రహం!

గత నాలుగేళ్లుగా వైఎస్‌ వివేకా హత్య కేసు పెద్ద మిస్టరీగా నడుస్తోంది. కొన్నాళ్లు ఆంధ్రప్రదేశ్‌ సీబీఐ అధికారులు ఆధ్వర్యంలో విచారణ సాగగా.. ఆ దర్యాప్తు సంస్థపై తనకు నమ్మకం లేదని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తెలంగాణకు ఈ కేసును మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో గత ఏడాది నుంచి తొలి నుంచి మళ్లీ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకుంటూ.. సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. కానీ కేసులో అసలు నిందితులు ఎవర్నది ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును దర్యాప్తు చేపడుతున్న సీబీఐ దర్యాప్తు అధికారులపై మండిపడింది. ఇది జరిగి కొన్ని రోజులు గడవకముందే.. మరోసారి ఇవాళ కూడా కేసు విచారణ తీరుపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. తక్షణమే దర్యాప్తు చేస్తున్న రాంసింగ్‌ అనే అధికారిని మార్చాలని ఆదేశించింది. ఈ కేసు స్టేటస్ రిపోర్ట్ లో ఎలాంటి పురోగతి లేదని, దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. అలాగే విచారణ అధికారి రాంసింగ్ ను మార్చివేయాలని జస్టిస్ ఎం. ఆర్. షా సిబిఐకి సూచించారు. ఇప్పటికీ దర్యాప్తును కొలిక్కి తీసుకురాలేకపోవడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అధికారిని తక్షణమే మార్చి.. దర్యాప్తు వేగవంతంగా జరిగేలా చూడాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ పై ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.