అవినాష్‌రెడ్డికి మూడోసారి సీబీఐ నోటీసులు

కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణ.. తుది దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు నిందితులుగా భావిస్తున్న వారి వాగ్మూలాలను రికార్డు చేసుకున్న సీబీఐ.. అసలు దోషులను పక్కా ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హత్య జరిగిన రోజు.. ముందుగా ఈ విషయం ఎవరికి తెలిసింది అన్న అంశం దగ్గర నుంచి విచారణ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆరోజు ప్రస్తుత కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి తొలుత వివేకా హత్య విషయం తెలిసిందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. వివేకా హత్య గురించి బాహ్య ప్రపంచానికి ఉదయం 6 గంటలకు తెలియగా.. అంతకు ముందే ఎంపీ అవినాష్‌ రెడ్డి, భాస్కరరెడ్డిలకు తెలిసిందని సీబీఐ వాదన. అయితే.. హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈక్రమంలో సీబీఐ అధికారులు ఇప్పటికే రెండు సార్లు ఎంపీ అవినాష్‌ రెడ్డిని హైదరాబాద్‌లో విచారించి.. పలు వివరాలు రాబట్టారు. దీనికోసం సాంకేతికతను కూడా వారు వినియోగించుకుంటున్నారు. ఇక మరో సారి అవినాష్‌ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డిలకు సీఐబీ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా చర్చ మొదలైంది. దీంతో కేసు దర్యాప్తు చివరి దశకు వచ్చేసిందని కొందరు అనుకుంటున్నారు.

విచారణకు ఇప్పుడే రాలేనన్న అవినాష్‌..
వివేకా కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆదివారం నాడు పులివెందులలోని భాస్కరరెడ్డి ఇంటికి వచ్చి ఈ నెల 6న విచారణ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహానికి రావాలని అతనికి, అవినాష్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే… అవినాష్‌ రెడ్డి తనకు కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయని.. ఇప్పుడే రాలేనని సీబీఐకి లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధికారులు ఈ నెల 10వ తేదీ ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్‌కు రావాలని ఆయన్ని ఆదేశించింది. అయితే భాస్కరరెడ్డిని ఈనెల 12వ తేదీన సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఇక ఈ విచారణలో సీబీఐ వారిని ఏమని ప్రశ్నిస్తుంది.. వారు ఏవిధంగా సమాధానాలు ఇస్తారు అన్నదానిపై సర్వత్రా చర్చ మొదలైంది.

అవినాష్‌ చుట్టూనే కేసు దర్యాప్తు..
వివేక హత్య కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీబీఐ అధికారులు… కేసును ఛేదించేక్రమంలో ప్రత్యక్ష సాక్షుల సాక్షంతోపాటు.. సాంకేతికతను కూడా వినియోగించుకుంటున్నారు. వివేక హత్య జరిగిన రోజు.. అంతకు ముందు రోజు ఏమేమి జరిగింది అన్న వివరాలను సేకరిస్తున్నారు. వివేకాను గొడ్డలితో దాడి చేసిన తర్వాత ఇంట్లోని రక్తపు మరకలను ఎవరు తుడిచేసివేశారు.. కట్లు ఎందుకు కట్టారు.. గొడ్డలి పోటును గుండె పోటుగా ఎందుకు వక్రీకరించారు అన్న విషయాలపైనే అవినాష్‌ను సీబీఐ ప్రధానంగా ప్రశ్నిస్తోందని సమాచారం. హత్య జరిగే ముందు రోజు కేసులో ఏ2గా భావిస్తున్న సునీల్‌ యాదవ్‌ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌లో తేలడంపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. మొత్తం మీద కేసు దర్యాప్తు తుది దశలో ఉందని.. సీబీఐని తప్పుదోవ పట్టించేలా ఎవరు ప్రయత్నించిన 41(ఏ) నోటీసులిచ్చి అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని కొందరు చెబుతున్నారు.