జవాబు పత్రాలు మిస్సింగ్.. ఎంతమందివి పోయాయంటే?
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో నిన్న పదో తరగతి పరీక్ష పత్రం లీకేజీ అంశం కలకలం రేపిన ఘటన మరువకముందే.. పదో తరగతి జవాబు పత్రాలు ఆదిలాబాద్ జిల్లాలో అదృశ్యమైన సంఘటన సంచలనం మారింది. పరీక్ష ముగిసిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ బస్టాండ్‌కు ప్రశ్నాపత్రాల బండెల్లను తరలిస్తుండగా.. ఓ బండెల్ మార్గం మధ్యలోనే మాయమైంది. దీన్ని బస్టాండ్ దగ్గరికి వెళ్లిన తర్వాత గుర్తించిన సిబ్బంది.. వెనక్కి వెళ్లి చూసినా ఎక్కడా కనిపించలేదు. దీంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
ఎన్ని పత్రాలు అదృశ్యం విద్యాశాఖ స్పందన..
ఉట్నూర్ బస్టాండ్‌కు పోస్ట్ ఆఫీస్ నుంచి బండెళ్లను తరలిస్తున్న క్రమంలో ఆటో నుంచి మాయమైంది. ఈ విషయాన్ని పోస్టల్ అధికారుల వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. ఆ పేపర్లు ఆటోలో తరలిస్తుండగా కిందపడిపోయాయా? లేక ఎవరైనా కావాలనే చోరీ చేశారా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై విద్యాశాఖ స్పందించింది. ఉట్నూరు పదో తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయని పేర్కొంది. దాదాపు 15 మంది విద్యార్థుల తెలుగు పేపర్‌కి సంబంధించిన జవాబు పత్రాలు అదృశ్యమయ్యాయని తెలిపింది. దీనికి పోస్టాఫీస్ అధికారులు బాధ్యులని అని తెలిపింది. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.