గ్యాస్‌ ధరల పెరుగుదలపై BRS నిరసన

ఆయిల్‌ కంపెనీలు మరోసారి గ్యాస్‌ ధరలను పెంచడంతో.. ఇకపై సామాన్యుడిపై పెను భారం పడనుంది. గృహిణులు వాడే గ్యాస్‌ ధర 50 రూపాయలు, కమర్షియల్‌ గ్యాస్‌ ధర 350 రూపాయల వరకు పెంచడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. పెంచిన గ్యాస్‌ ధరలు మార్చి 1వ తేదీ నుంచే అమలవుతాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచడం ద్వారా కానుక ఇచ్చారని విమర్శించారు. మహిళా దినోత్సవం రోజున (మార్చి 8) మహిళలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ సందర్బంగా రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మాటి మాటికీ గ్యాస్‌ ధరలను పెంచడం ఆనవాయితీగా మారిందని.. దీన్ని ప్రశ్నించకపోతే ప్రజలకు నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్‌ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎక్కడికక్కడ వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మహిళా దినోత్సవం రోజున సైతం నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

వెల్లువెత్తిన ఆందోళనలు..
కేంద్ర ప్రభుత్వం తాజాగా సిలిండర్‌ ధరను రూ.50, కమర్షియల్‌ సిలిండర్‌ ధరను రూ.350 చొప్పున పెంచింది.. అంటే హైదరాబాద్‌లో సాధారణ సిలిండర్‌ ధర మొత్తం కలిసి 1155 రూపాయలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గ్యాస్‌ ధర 1161 రూపాయలకు చేరింది. మోదీ అధికారంలోకి రాకముందు.. సిలిండర్‌ ధర 400 రూపాయలు ఉందని.. అధికారంలోకి వచ్చిన పదేళ్లకే రూ.1,155కు చేరుకుందని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్‌ ధరల పెంపు ప్రజల నడ్డి విరిస్తున్నదని, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉందన్నారు. ధరలు పెరగడంతో ప్రజల కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన ఆయన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాస్తంగా బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున రోడ్డుమీదకు వచ్చి సిలిండర్లతో వినూత్న నిరసనలు తెలియజేశారు.

ప్రజల కష్టాలు పట్టించుకోరా..
ఇప్పటికే పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలను చూసి… అనేక మంది మహిళలు గ్రామాల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారని.. మరోసారి గ్యాస్‌ ధరలు పెంచడంతో మధ్యతరగతి వారిపై మరింత భారం పడిందన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ధరలను పెంచుతున్న తీరును స్థానికంగా మీడియా ద్వారా ప్రజలకు చేరేలా చూడాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఒకవైపు ఉజ్వల సీఎం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం భారీగా గ్యాస్‌ ధరలను పెంచుతోందని.. ఆరోపించారు.