BRS నుంచి సస్సెండ్‌ అయిన నేతల స్పంద‌న‌

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ… అవకాశం దొరికినప్పుడల్లా.. ప్రభుత్వ తీరును ఎండగడుతున్న.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఆ పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఏప్రిల్ 9న ప్రభుత్వంపై వీరు చేసిన వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి ఇవాళ సస్పెండ్‌ చేశారు.

నిన్న ప్రభుత్వంపై విమర్శలు… నేడు వేటు..
కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరికి సమయం, సందర్బం దొరికినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏప్రిల్ 9న కొత్తగూడెంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వీరు తూర్పూరబట్టారు. ఉద్యమం కోసం పోరాడిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతారా..? ప్రజాప్రతినిధులకు కనీసం అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ ఇవ్వరా..? తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బహిరంగంగా ఆరోపణలు చేశారు. అవి కాస్త బీఆర్‌ఎస్‌ అధిష్టానం దగ్గరకు వెళ్లాయి. దీంతో వారిని ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అంత తొందరగా వదులుకోదనే ప్రచారం ఉంది. అసంతృప్తిగా ఉన్న నాయకులు వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేస్తుందనే ఆరోపణ ఉంది. అయితే.. 2018లో ముగ్గురు రెబల్స్ ను పార్టీ సస్పెండ్ చేయగా.. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఎవర్నీ సస్పెండ్ చేయలేదు. కొందరు ఆ పార్టీ వద్దనుకుని భయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు పొంగులేటి, జూపల్లిని సస్సెండ్‌ చేయడంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

సస్పెండ్‌ చేసిన తర్వాత వారు ఏమన్నారంటే..
తమను సస్సెండ్‌ చేయడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. తాను పార్టీ సభ్యుడినే కాదన్నప్పుడు ఏవిధంగా సస్పెండ్‌ చేశారని ప్రశ్నించారు. జనవరి నుంచి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నానని తెలిపారు. వంద రోజుల తర్వాత అయినా బీఆర్‌ఎస్‌ నేతలు ధైర్యం తెచ్చుకొని నన్ను సస్పెండ్‌ చేశారని అన్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. ‘మా గతి మీకూ పడుతుందని చాలామంది బీఆర్‌ఎస్‌ నేతలు అప్పుడే చెప్పారు. పాలేరు ఉప ఎన్నికలో విజయం కోసం నాపై ఒత్తిడి తెచ్చారు. 6 నెలలు మా సార్‌ నిన్ను కింద నడవనీయరని తోటి ఎంపీలు చెప్పారు. ఆరు నెలల తర్వాత మా సార్‌ అసలు రూపం తెలుస్తుందని అన్నారు. ఆరు నెలలు కాదు నా విషయంలో 5 నెలల్లోనే పరిస్థితి అర్థమైందని’ ఆయన ఎద్దేవా చేశారు.

జూపల్లి కృష్ణారావు ఇలా..
తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం సంతోషమేనని జూపల్లి కృష్ణారావు అన్నారు. కానీ ఎందుకు తనను పార్టీ నుంచి సస్సెండ్‌ చేశారో చెప్పాలన్నారు. తాను అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘మూడేళ్లుగా బీఆర్‌ఎస్‌ సభ్యత్వం పుస్తకాలు నాకు ఇవ్వలేదు. పార్టీ సభ్యుడిగా నేను ఉన్నట్లా? లేనట్లా? పారదర్శక పాలన అందించడం ప్రభుత్వం బాధ్యత. ఇష్టారీతిన పాలన చేస్తా.. అడిగేందుకు మీరెవరు? అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో యావత్‌ తెలంగాణ సమాజం భాగస్వామ్యం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లా అంతటా పాదయాత్ర చేశాను. స్వరాష్ట్ర సాధనలో భాగంగా ఎమ్మెల్యే, మంత్రి పదవులను త్యాగం చేసినందుకు బీఆర్‌ఎస్‌ తనకు ఇచ్చిన బహుమతి ఈ సస్పెన్షన్‌” అని ఆయన ఆరోపించారు.

అయితే.. బీఆర్‌ఎస్‌ నుంచి సస్సెండ్‌ అయిన ఈ ఇద్దరు నాయకులు జాతీయ పార్టీలో చేరుతారని చెబుతున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల కిందట పొంగులేటి ప్రకటించారు. అయితే.. ఆ జాతీయ పార్టీ కాంగ్రెస్సా, లేదా బీజేపీనా అనేది ఆసక్తిగా మారింది. మరి జూపల్లి పయనం ఏటు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కాంగ్రెస్ లో ఆయన పని చేశారు. మంత్రిగానూ సేవలందించారు.