ప్రియురాలి చెప్పులు మోసిన బాలీవుడ్ స్టార్ హీరో!
ఇటీవల జరిగిన నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనేకమంది బాలీవుడ్ తారలు మెరిసిన సంగతి తెలిసిందే. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా, బిజినెస్ ప్రముఖులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన ప్రియురాలు సబా ఆజాద్‌తో కలిసి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కాగా, ప్రస్తుతం హృతిక్‌కి సంబంధించిన ఓ వార్త ఫొటోతో సహా నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు ‘ఎంతటి వాడైనా.. తగ్గక తప్పదు.., ప్రియురాలంటే ఎంతిష్టమో..’ అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
హృతిక్ రోషన్ 2014లోనే తన భార్య సుసానే ఖాన్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నా కొన్నాళ్లుగా బాలీవుడ్ నటి, సింగర్ సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఎక్కడికెళ్లినా ఇద్దరూ జంటగా వెళ్తున్నారు. పార్టీలకు, ఈవెంట్స్ కి కూడా హృతిక్, సబా కలిసే వెళ్తున్నారు. వీరు అధికారికంగా చెప్పకపోయినా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్. దీంతో హృతిక్, సబా ఎక్కడ జంటగా కనిపించినా హాట్ టాపిక్‌గా మారిపోతోంది. ఇక, తాజాగా హృతిక్ చేసిన పనికి అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కి వచ్చిన ఈ జంట వేరే సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగుతున్న సమయంలో సబా తన చెప్పులు తీసేసి ఫోటోలు దిగుతోంది. అయితే ఆ చెప్పులను హృతిక్ చేత్తో పట్టుకొని వేరే వాళ్ళతో మాట్లాడటం, తిరగుతూ కెమెరా కంటపడ్డాడు. ఇంకేముంది…అంత పెద్ద పార్టీలో హృతిక్ ప్రియరాలి చెప్పులు మోశాడు అంటూ ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది అంత స్టార్ హీరో అయినా ప్రియురాలి చెప్పులు అంత పెద్ద పార్టీలో మోస్తున్నాడంటే అతనికి సబా అంటే ఎంత ఇష్టమో అని కామెంట్స్ చేస్తుంటే, కొంతమంది మాత్రం అలా పార్టీలో చెప్పులు మోయిస్తావా అంటూ సబాని తిడుతున్నారు. ఏదేమైనా మొత్తానికి హృతిక్, సబా మధ్య బంధం ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన చెప్పేస్తోంది. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!