bjp: ఖమ్మంపైనే ఫోకస్‌.. నేడు పొంగులేటితో నాయకుల భేటీ!

khammam: తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా(khammam district)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఏ పార్టీ లీడ్‌ సాధిస్తే.. రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలో ఉంటుంది. అంతేకాకుండా.. తెలంగాణకు ఖమ్మాన్ని గుమ్మంగా పిలుస్తారు. అందుకే ఈ జిల్లాలోని రాజకీయాలు, అక్కడి నేతలపై అన్ని పార్టీల ఫోకస్‌ ఉంటుంది. ఇక ఇటీవల.. ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(ponguleti srinivas reddy)ని బీఆర్ఎస్‌(brs) సస్పెండ్‌ చేసింది. ఈక్రమంలో ఆయన జాతీయ పార్టీలో త్వరలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే.. దానిపై పొంగులేటి నుంచి ఎలాంటి స్పస్టత రాలేదు. ఈనేపథ్యంలో కొన్ని రోజుల కిందట కాంగ్రెస్‌(congress) పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం.. పొంగులేటితో చర్చలు జరిపింది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్‌తో చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా లేవు.

తాజాగా.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ బీజేపీ(bjp) నేతలు కలవనున్నారు. దీంతో ఖమ్మం పాలిటిక్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డైరెక్షన్‌లో బీఆర్‌ఎస్‌ వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకునేలా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌(mla etela rajender) ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మానికి వచ్చి పొంగులేటితో భేటీ కానున్నారు. ఇప్పటికే పలుమార్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు పొంగులేటిని కలిశారు. దీంతో నేడు పొంగులేటి పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొంగులేటి బీజేపీలో చేరటం దాదాపు ఖాయమని అనుచరులు చెబుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పొంగులేటి బీజేపీలో చేరుతారని అంటున్నారు.