Bichagadu2: వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్​ ఆంటొని!

Hyderabad: కోలీవుడ్​(Kollywood) మల్టీటాలెంటెడ్​ హీరో విజయ్ ఆంటొని (Vijay Antony) నటించిన తాజా చిత్రం ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2). 2016లో విడుదలైన ‘బిచ్చగాడు(Bichagadu)’ సినిమాకు సీక్వెల్​గా ఈ సినిమా తెరకెక్కింది. కావ్య థాపర్(Kavya Thapar) ఈ సినిమాలో హీరోయిన్​గా నటించారు. చెల్లెలి సెంటిమెంట్​తో రానున్న ఈ సినిమా మే 19న తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.  ప్రమోషన్స్​లో భాగంగా శుక్రవారం హైదరాబాద్​లో ప్రెస్ మీట్‌ నిర్వహిచింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటొని, కావ్య థాపర్, జాన్ విజయ్, ఫాతిమా విజయ్ ఆంటొని, ఆర్.నారాయణమూర్తి, చదవలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ ఆంటొని మాట్లాడుతూ.. ‘బిచ్చగాడు 2’ కథ విషయంలో జరిగిన వివాదం, కేసులపై వివరణ ఇచ్చారు. ‘సింగపూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ కథ నాది అని అన్నారు. చెన్నైకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కథ మాదే అని కేసు పెట్టారు. వీళ్లు మాత్రమే కాదు.. చాలా మంది ఈ కథ మాదే అని వాదించారు. అసలు విషయం ఏంటంటే.. నేను సినిమాలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. కథ, కథనం అన్నీ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ మీద ఉండవు. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, సర్జరీపై 100కు పైగా కథలు ఉన్నాయి. నాది కూడా అలాంటి కథే అని వారంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. తమిళనాడు హైకోర్టు విచారించి ఈ సినిమా కథకు ఇతర ఏ కథలతోనూ సంబంధంలేదని.. ఇది పూర్తిగా భిన్నమని తీర్పు ఇచ్చింది. ‘బిచ్చగాడు’ కథ నేనే రాసుకున్నా. దర్శకత్వం మాత్రం శశి చేశారు. ‘బిచ్చగాడు 2’ కథ కూడా నేనే రాసుకున్నా. నిజానికి దర్శకత్వం వహించే ఆలోచన నాకు లేదు, శశి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో రెండేళ్లపాటు వేచిచూడలేక నేనే దర్శకత్వం వహించా’ అని చెప్పుకొచ్చారు విజయ్​. ఈ సినిమాను విజయ్​ సతీమణి ఫాతిమా నిర్మించారు.