తెలుగు రాష్ట్రాల నుంచి పరుగు తీయనున్న భారత్ గౌరవ్ రైలు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి శనివారం(మార్చి18,2023) మొదటి భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కానుంది. పుణ్యక్షేత్ర యాత్ర – పూరి – కాశీ – అయోధ్య పేరిట యాత్రికుల రైలును ప్రారంభించనుంది భారత రైల్వే శాఖ. శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి భారత్ గౌరవ్ రైలు ప్రారంభమవ్వనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి భారత్ గౌరవ్ రైలు ప్రయాణం ప్రారంభించనుంది. యాత్రలో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ సందర్శన ఉంటుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు యాత్రికుల ప్రత్యేక రైలు సాగనుంది. మొట్టమొదటి రైలు ప్రయాణానికే అనూహ్యంగా బుకింగ్స్ జరిగాయి. భారత్ గౌరవ్.. యాత్రికుల ప్రత్యేక రైలు. లగ్జరీ సదుపాయాలతో రైలును ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వందే భారత్ రైలు తరహాలోనే వేగం, సౌకర్యాలతో ప్రయాణీకులను ఆకట్టుకునే సకల సదుపాయాలు ఈ రైలులో జోడించింది భారత రైల్వే. భారత్ గౌరవ్ రైలులో ప్రయాణించడం ద్వారా ఒకే ప్రయాణంలో వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. కాశీ యాత్ర చేసేవారికి ఇది చక్కని అవకాశం అని భావిస్తున్నారు ప్రయాణికులు.