రోడ్డు కూలీ బాదేశ్‌.. ‘బాద్‌షా’ అయ్యాడు: లాటరీలో జాక్‌పాట్‌!

రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావాలని చాలా మంది కలలు కంటుంటారు… అది అందరికీ సాధ్యం కాకపోవచ్చుకాని.. కొందరికి మాత్రం ఎక్కడో ఒకచోట అది సాధ్యపడుతుంటుంది. అలాంటి సంఘటనే కేరళలో జరిగింది. పశ్చిమబెంగాల్ కు చెందిన కూలీ ఎస్కే బాదేశ్‌కు లాటరీలో ఏకంగా 75 లక్షలు తగలడంతో తొలుత షాక్‌కు గురయ్యాడు.. అనంతరం తేరుకుని ఆ లాటరీ టికెట్టు, డబ్బు ఎవరైనా కాజేస్తారేమోననే భయంతో దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు పరుగులు తీశాడు. అసలు ఎవరీ బాదేశ్‌… అతనికి ఏవిధంగా లాటరీ టికెట్టు కొనుగోలు చేశాడు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బతుకుదెరువు కోసం వచ్చి… జాక్‌పాట్‌ కొట్టాడు..
మనం నిత్యం అనేక రైళ్లలో చూస్తుంటాం.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అనేకమంది దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో కూలీ పనుల కోసం నిత్యం వస్తుంటారు. ఇక్కడ సుమారు ఆరు నుంచి ఏడాది పాటు పనులు చూసి వారి ఇళ్లకు వెళ్లి వస్తుంటారు. జీవనోపాధి కోసం వారు కుటుంబాన్ని కూడా వదిలి నెలల తరబడి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. సరిగా ఇదే విధంగా పశ్చిమ బెంగాల్‌ నుంచి కేరళకు రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం ఎస్కే బాదేశ్‌ అనే వ్యక్తి వచ్చాడు. అయితే మనోడికి ముందునుంచే లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉంది. అలా కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్త్రీశక్తి లాటరీ సంస్థ నుంచి ఓ టికెట్ ను కొనుగోలు చేసి తన లక్కుని పరీక్షించుకున్నాడు. ఈక్రమంలో అతను అతడు కొన్న టికెట్‌కు రూ. 75 లక్షలు లాటరీ తగిలింది. ఈ విషయం ఈనెల 14న అతనికి ఈ విషయం తెలిసింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే వెన్నులో వణుకు మొదలైంది. దీంతో దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌కు బాదేశ్‌ పరుగులు తీశాడు.

పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాడంటే…
బాదేశ్‌కు లాటరీ తగిలింది అన్న విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమయ్యాడు. తనకు నగదు వచ్చిన విషయం ఎవరికైనా తెలిస్తే ముందే కాజేస్తారేమోనని.. కంగారు పడ్డాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాలని భావించి మువట్టుపుళా పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు. పోలీసులను కలిసి తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. బాదేశ్‌కు లాటరీ టికెట్ క్లెయిమ్ చేసుకోవడమెలాగా కూడా తెలియదు. దీనికితోడు టికెట్ ఎవరైనా లాక్కుని హాని తలపెడతారన్న భయంతోనే బాదేశ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు అతడికి అండగా ఉంటామని సాయం చేస్తామని పేర్కొన్నారు.

ఆ డబ్బులతో ఏం చేస్తాడంటే..
లాటరీ తగలడంపై బాదేశ్ స్పందిస్తూ.. డబ్బులు చేతికి అందిన తర్వాత తన స్వగ్రామం వెళ్లి ఇంటికి మరమ్మతులు చేయించుకుంటానని తెలిపారు. మిగిలిన డబ్బులతో వ్యవసాయం చేసుకుంటానని తెలిపాడు. డబ్బులు వచ్చిన వెంటనే సొంతూరు వెళ్లిపోతానంటున్నాడు బాదేశ్‌.