క‌లిసి పోరాడ‌దాం: రేవంత్‌, సంజ‌య్‌కు ష‌ర్మిళ ఫోన్!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ పెట్టిన నాటి నుంచి అధికార బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల ఆమె పాదయాత్రను కూడా పోలీసులు అడ్డుకోవడం వంటి ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ప్రస్తుతం టీఎస్పీఎస్సీలో పరీక్ష పత్రాల లీకేజీ అంశం రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. అధికార బీఆర్‌ఎస్‌పై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేసీఆర్‌ కుటుంబంతోపాటు.. ప్రధానంగా కేటీఆర్‌ ను టార్గెట్‌ చేస్తూ.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ తెలంగాణలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వైఎస్‌ షర్మిల… బీజేసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ ఇష్యూపై కలిసి పోరాడదామని.. అందుకోసం కార్యాచరణ రూపొందిద్దామని ఆమె కోరారు. దీనికి వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు సమాచారం.

రేవంత్‌, బండి ఇలా స్పందించారు.. 
సీఎం కేసీఆర్‌ మెడలు వంచైనా.. నిరుద్యోగులకు న్యాయం చేద్దామని వైఎస్‌ షర్మిల మాట్లాడారు. దీంతోపాటు ప్రగతి భవన్‌ మార్చ్‌కు పిలుపునిద్దామని ఆమె కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని షర్మిల తెలిపారు. కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని.. కేసీఆర్‌ని ఇప్పుడే ఎదుర్కోవాలని ఆమె తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన బండి సంజయ్‌.. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉమ్మడిగా పోరాటం చేసేందుకు తాము సిద్దమే అన్నట్లు సంకేతాలు ఇచ్చారంట. ఇక రేవంత్‌ రెడ్డి కూడా పార్టీ పెద్దలతో మాట్లాడి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని షర్మిలతో చెప్పినట్లు సమాచారం. ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్‌, వైఎస్సార్‌ తెలంగాణ, బీఎస్పీ పార్టీలు అన్ని ఒకే తాటిపైకి వచ్చి నిరసనలు తెలిపితే.. బీఆర్‌ఎస్‌కు ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి త్వరలోనే వీరందరూ కలిసి ఉద్యమానికి పిలుపునిస్తే.. కేసీఆర్‌, కేటీఆర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.