Telangana: కొత్త సచివాలయంపై బండి సంజయ్ విమర్శలు.. కారణం ఇదే!
hyderabad: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయ(telangana new secretariat) భవనాన్ని నిర్మించగా.. ఇటీవల సీఎం కేసీఆర్(cm kcr) ఆ భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే ఇలాంటి కట్టడం లేదని బీఆర్‌ఎస్(brs) శ్రేణులు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. సచివాలయాన్ని.. తెలంగాణ వైట్ హౌస్ అంటూ.. సోషల్ మీడియాలో… పత్రికా ప్రకటనలు, టీవీ, ప్రింట్ మీడియాలో భవన సముదాయం ప్రత్యేకతలను తెలియజేసేలా ప్రచారం చేసేందుకు కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అయితే.. పలు పార్టీల నుంచి సచివాలయ ప్రకటనల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అధికంగా ఖర్చుపెడుతోందని విమర్శలు వచ్చాయి. ఈక్రమంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్(telangana bjp chief bandi sanjay) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడూ తనదైన శైలిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడే బండి సంజయ్.. తాజాగా కొత్త సచివాలయం భవన ఆకృతిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సచివాలయం.. బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మైత్రికి గుర్తుగా నిర్మించినట్లు ఉందని ఆరోపించారు. భవన నిర్మాణం తెలంగాణ కల్చర్‌కు దగ్గరగా లేదని ఘాటుగా స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. సెక్రటేరియట్ డోమ్స్(గోపురాలు) పగల గొడుతాం అని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. బీజేపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా బండి సంజయ్ బీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో హిందూ, ముస్లింలను వేరు చేయడంలో భాగంగా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని పలువురు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ మోడల్ దేశానికి ఆదర్శం అని బీఆర్‌ఎస్ నేతలు చెబుతుండగా.. దీనికి కౌంటర్‌గా సంజయ్ మాత్రం.. యూపీ మోడల్ తెస్తామని అంటున్నారు. తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలని.. అందుకు బీజేపీని గెలిపించాలని ఇటీవల ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు అమిత్‌షా కూడా.. తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడితే.. ముస్లింల రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.