bandi sanjay: కేసీఆర్‌ను అతీక్‌తో పోల్చిన బండి..నిజ‌మేనా?

hyderabad: సాధారణంగా మాట్లాడే నాయకుల వీడియోలు, మాటలకంటే.. ప్రత్యర్థులపై బూతులు, తీవ్రమైన ఆరోపణలు, వ్యక్తిగత హననం చేసే నాయకుల వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇవి అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని చెప్పలేం. కానీ.. మెజార్టీ ప్రజలకు అలాంటి వీడియోలు చేరుతున్నాయి.. వారు వీక్షిస్తున్నారు కూడా. ఇక తాజాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇటీవల యూపీలో ఎన్‌కౌంటర్‌ కాబడిన అతీక్‌ అహ్మద్‌తో పోల్చారు. అసలు అతీక్‌ అహ్మద్‌కు కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ను విమర్శించడంలో భాగంగా.. ట్రెండింగ్‌లో ఉన్న అతీక్‌ ఎన్‌కౌంటర్‌ను బండి వాడుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ఆఫ్ఘనిస్థాన్‌ పాలనను తలపిస్తోందని విమర్శించారు. ఒకవేళ ఆయన ఆరోపణలు నిజమైతే.. కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పటికే కేసీఆర్‌పై చర్యలు తీసుకునేది. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవితను కూడా దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. బండి చేస్తోంది ఆరోపణలు మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాజకీయ నాయకులు వార్తల్లో ఉండటానికి … ప్రజల్ని ఆకర్షించడానికి.. వీడియోలు వైరల్‌ అవ్వడానికి.. బాగా మసాలా వేస్తే నషాలానికి తాకుతుంది అనే ఉద్దేశంతో  ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు కానీ.. అంతా నిజమేనని నమ్మలేం. ఇక ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తే జనం చూస్తున్నారు… ప్రస్తుతం ఇలాంటి డిమాండ్‌ ప్రజల్లో ఉంది కాబట్టే నాయకుల ప్రవర్తన కూడా అందుకు తగ్గట్టే ఉంది. దీంతోపాటు తెలంగాణలో తొలి నుంచి బీజేపీ కంపారిజన్‌ పాలిటిక్స్‌ను ప్రచారం చేస్తూ వస్తోంది. అంటే యూపీ తరహాలో బుల్డోర్‌ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని.. హిందుత్వం తమ నినాదం అని చెప్పుకుంటూ వస్తోంది. అయితే.. ప్రజల ఆకాంక్షలు కూడా ఆ మేరకు ఉన్నాయో లేదో బీజేపీ కూడా గ్రహించాలి. అప్పుడే ఫలితాలు ఆశించిన విధంగా వస్తాయి.