బెయిల్‌పై విడుదలైన బండి సంజయ్‌: కేటీఆర్‌పై ఫైర్‌!

పదో తరగతి హిందీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఏ1గా బండి సంజయ్‌ పేరును పోలీసులు ప్రస్తావించి అరెస్టు చేసిన సంగతి విదితమే. ఆయనకు కోర్టు సైతం రిమాండ్‌ విధించింది. ఈక్రమంలో బండి తరపు లాయర్లు.. హనుమకొండ కోర్టును బెయిల్‌ కోసం ఆశ్రయించగా.. వారు బెయిల్‌ మంజూరు చేశారు. ఇక ఇవాళ ఉదయం తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం, కేసీఆర్‌ సర్కార్‌, కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇరు పక్షాలు కౌంటర్లు..
సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హనుమకొండ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వద్ద ఆయన తరఫు న్యాయవాది విద్యాసాగర్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై పీపీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. బండి సంజయ్‌ను మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ వేశారు. ఇరువైపులా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరికి బండి సంజయ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్‌ జైలు నుంచి బండి సంజయ్‌ బయటకు రాగా.. పోలీసులు జైలు పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో ఎవరు గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జైలు బయట వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. మరోవైపు.. సంజయ్‌ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌ జైలు వద్దకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలి..
జైలు నుంచి విడుదల అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎ‍స్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్టింగ్‌ జడ్జీతో​ విచారణ జరిపించాలి. కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలి. పేపర్‌ లీకేజీలో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలని బండి డిమాండ్‌ చేశారు. జిమ్మిక్కులతో ఇష్యూను డైవర్ట్‌ చేయాలని చూస్తున్నారు. హిందీ పేపర్‌ ఎవడైనా లీక్‌ చేస్తారా. మరి తెలుగు పేపర్‌ను ఎవరు లీక్‌ చేశారు?. పేపర్‌ను ఎవరో లీక్‌ చేస్తే నాకేంటి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. సరే లీకేజ్‌ అని అంటున్నారు కదా.. అసలు పరీక్ష సెంటర్‌లోకి ఫోన్లు ఎట్లా తీసుకువెళ్లారు. పోలీసులు, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు. ఫోన్లు లోపలికి ఎలా తీసుకుపోయారు? ఎవరు తీసుకుపోయారో దర్యాప్తు చేయండి. అవి ఏవీ చేయకుండా తనను కుట్రపూరితంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. కరీంనగర్‌ పోలీసులు పోస్టుల కోసం, డబ్బుల కోసం పనిచేస్తున్నారు. సీపీ అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. వాట్సాప్‌లో ఎవరో పేపర్‌ షేర్‌ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. లీక్‌కు, మాల్‌ ప్రాక్టీస్‌కు కూడా సీపీకి తేడా తెలియదా? బండి మండిపడ్డారు. మంత్రి హరీష్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే హరీష్‌రావే ముందుగా పార్టీ నుంచి జంప్‌ అవుతారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.