OTTలోకి “బలగం”.. స్ట్రీమింగ్​ ఎక్కడంటే!

చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమా ‘బలగం’. ప్రముఖ హాస్య నటుడు వేణు టిల్లు డైరెక్షన్‌ దర్శకత్వంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించిన సినిమా ‘బలగం’. దిల్ రాజు సమర్ఫణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ప్రొడ్యూస్ చేశారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకులనూ మెప్పించింది. ఈ సినిమాలో తెలంగాణ పల్లె జీవనాన్ని, మనుషుల మధ్య బంధాలను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 24న అంటే ఈరోజు నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మల్లేశం తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ప్రియదర్శిలో మంచి కమెడియన్‌ కాకుండా.. మంచి నటుడు ఉన్న విషయం మల్లేశం మూవీతోనే ఇది వరకు ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్య తరగతి తెలంగాణ యువకుడి పాత్రలో తన పరధి మేరకు రాణించాడు. ప్రియదర్శి తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్యా కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నేటితో మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు కొత్త సంవత్సరాది శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ‘బలగం’ చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని ప్రసాద్, ప్రవీణ నాయుడు మరియు వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న పలువురిని ఉగాదినంది పురస్కారంతో సత్కరించారు.ఉగాది రోజు టీం మొత్తాన్ని ఘనంగా సత్కరించిన తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు విజయ్ వర్మ పాకలపాటికి నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత, నటీనటులు సాంకేతిక నిపుణులు కృతఙ్ఞతలు తెలియజేసారు. బలగం లాంటి చిత్రాలు మరిన్ని రావాలని ఇదొక దృశ్య కావ్యం అని ఆర్ నారాయణమూర్తి, రుద్రరాజు పద్మ రాజు కొనియాడారు.