Politics: ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధం
vijayawada : ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు(harish rao) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. అక్కడికి…ఇక్కడికి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని ఆయన చెప్పారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు. సంగారెడ్డిలో మంగళవారం మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడారు. అయితే హరీష్‌రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి కౌంటర్ ఇచ్చారు. మంత్రి హరీష్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు. హరీష్ రావు సమయం చూసుకుని ఏపీ రావాలని.. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూపిస్తామన్నారు. తెలంగాణ స్కూళ్లకు, ఏపీలో బడులకు చాలా తేడా ఉందన్నారు. హైదరాబాద్‌లో వర్షాలు వస్తే ఇళ్లపైకి నీళ్లు వస్తాయని ఎద్దేవా చేశారు. అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయని కారుమూరి మండిపడ్డారు. ఏపీ దేశంలోనే నంబర్ వన్‌గా ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోనే అభివృద్ధి జరిగితే సరిపోదని.. తెలంగాణ అంతతా జరగాలని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీ మంత్రి కారుమూరి(karumuri nageswara rao)కి తెలంగాణ మంత్రి హరీష్ మరోసారి కౌంటర్(counter) ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందని అన్నారు. సుమారు 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందన్నారు. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్ ఉందని.. కళ్యాణ లక్ష్మి పథకం ఉందన్నారు. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉందన్నారు. కనీసం ప్రత్యేక హోదా కూడా కేంద్రం ఇవ్వకపోయినా.. ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరన్నారు హరీష్‌రావు. ఇక విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఉందన్నారు.