ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా.. కొనసాగుతున్న ఓట్లు లెక్కింపు!

మార్చి13న ఎన్నికలు జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, నాలుగు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు పోటీ పడుతున్న 139 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. అయితే ఇప్పటి వరకు అందిన ఫలితాల మేరకు..

స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 4 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అన్ని చోట్ల ఓటమి పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రనాథ్ గెలుపొందారు. కవురు శ్రీనివాస్ కు 481 ఓట్లు రాగా, వంకా రవీంద్రనాథ్ కు 460 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు 120 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థుల గెలుపొందారు. ఆ పార్టీకి చెందిన డాక్టర్ మధుసూధన్ రావు గెలుపొందారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలిచారు. ఆయనకు 636 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్తికి 108 ఓట్లు వచ్చాయి. మరోవైపు స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన అయిదు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఆలస్యం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సుమారు రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. మొత్తం రెండు లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే.. తొలి, రెండో ప్రాధాన్య ఓట్లను కూడా లెక్కించాల్సి రావడంతో కౌంటింగ్‌ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఎన్నికలకు సంబంధించి విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో 500 మంది ఎన్నికల సిబ్బంది నాలుగు బృందాలుగా ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు.

శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల స్థానానికి 28 టేబుల్స్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి 40 టేబుల్స్, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు కౌంటింగ్‌కు 25 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు టీచర్ల నియోజకవర్గానికి 14, కడప-అనంతపురం-కర్నూలు టీచర్ల నియోజకవర్గానికి 15 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానాలకు 5, శ్రీకాకుళానికి 4, కర్నూలుకు 2 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు.