ప్రభుత్వం వర్సెస్‌ ఉద్యోగులు.. సమరానికి సై!

ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. సీఎం జగన్‌ 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర నిర్వహించిన తరుణంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి.. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే.. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యి దాదాపు నాలుగేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇక ఈక్రమంలో ఈ నెల 9వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈనెల 9 నుంచి ఏప్రిల్‌ అయిదో తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అమరావతి జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏప్రిల్‌ అయిదో తేదీన తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్‌ వైఖరి ఏంటి? ఉద్యోగులు అడుగుతున్నది ఏంటి? అన్న అంశాలపై విశ్లేషణాత్మక కథనం.

ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే..

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రధానంగా నాలుగు ఉన్నాయి. 1. ఏపీ ఎన్‌జీవోస్‌, 2. సచివాలయం జేఏసీ, 3.అమరావతి జేఏసీ, 4. కమర్షియల్‌ ట్యాక్స్‌ జేఏసీ.. ఇలా ఈ నాలుగు సంఘాలు ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నాయి. ఇందులో కొన్ని ప్రభుత్వానికి మద్దతు ఇస్తుండగా.. మరికొన్ని వారి సమస్యలను పరిష్కరించాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పీఆర్‌సీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. డీఏలు కూడా ఇవ్వలేదు. పీఆర్‌సీ ఇవ్వకుండా డీఏ కింద వాటిని జమ చేశారు. ఫిట్‌మెంట్‌ కూడా తగ్గించడంతో ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై ప్రస్తుతం గుర్రుగా ఉన్నారు. మరోవైపు హెచ్‌ఆర్‌ఏ కూడా తగ్గించారు. అధికారం చేపట్టిన వారానికే సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పిన జగన్‌.. ఆ హామీ తెలియక, అవగాహన లేక సీపీఎస్‌ రద్దు చేస్తానని చెప్పానని మాట మార్చి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతోపాటు ఉద్యోగ విరమణ పొందిన వారికి రావాల్సిన బెన్ఫిట్స్‌ కూడా చాలా ఆలస్యంగా ఇస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. ఇక ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్‌ నగదు, ఏపీజీఎల్‌ఐ ఇన్స్యూరెన్స్‌ డబ్బులు కూడా తీసుకునేందుకు దరఖాస్తు చేస్తుకున్నా అవి రావాలంటే.. చాలా రోజుల సమయం పడుతోంది. అత్యవసరానికి కూడా ఉద్యోగులు వారి డబ్బులను వినియోగించుకోలేకపోతున్నందుకు చాలా మంది ఆవేదన చెందుతున్నారు. ఇలా తమ సొంత డబ్బును కూడా ప్రభుత్వం వద్దే ఉంచుకుని.. ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని సీఎం జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై కొన్ని సంఘాలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నాయి.

ఉద్యోగ సంఘాలతో భేటీ కానీ జగన్‌..
ఉద్యోగ సంఘాలు గత ఏడాది విజయవాడలోని బీఆర్టీఎస్‌ రోడ్డులో తమ సమస్యలను పరిష్కరించాలని భారీ ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన మంత్రుల బృందం.. పీఆర్‌సీ పెంచుతున్నట్లు, అదే విధంగా పెండింగ్‌ డీఏలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఉద్యోగులు వాస్తవంగా అడిగిన దానికి .. ప్రభుత్వం ఇచ్చినదానికి పొంతనలేదు. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల సంఘాల పట్ల ఉద్యోగుల్లో నమ్మకం కూడా పోయింది. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వంపై ఉద్యోగులు వ్యతిరేకభావం పెరుగుతున్నా.. సీఎం జగన్‌ మాత్రం ఇప్పటి వరకు వారి సమస్యలను పరిష్కరించేందుకు ఒక్కసారి కూడా వారితో సమావేశం కాకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఆ మధ్య విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చే డీఏలకు బదులు ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకం ఇస్తే.. వైసీపీకి ఓట్లు వస్తాయని వ్యాఖ్యానించి ఉద్యోగులను అవమానపరిచారు.

ఎక్కడికక్కడ ఉద్యోగుల కట్టడికి యత్నం..
ప్రభుత్వ ఉద్యోగులు, సంఘాలు వారి సమస్యలను తెలియజేసేందుకు నిరసన లేదా ధర్నా చేపట్టే స్వేచ్ఛ ఎక్కడైనా ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితులు లేవని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. కనీసం తమ సమస్యలపై మాట్లాడే హక్కు కూడా లేదు అన్నట్లు ప్రభుత్వ వైఖరి ఉందని ఆయా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏదైనా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే.. గృహనిర్భంధం, లేదా పోలీసు స్టేషన్లకు పిలిపించడం వంటివి చేస్తున్నారని .. వాపోతున్నారు. ఇక ఇదే క్రమంలో సీపీఎస్‌పై కూడా ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి… ‘‘రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు.. మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా?.. ప్రజాప్రతినిధులు జీతాలు వారే నిర్ణయించుకుంటారు.. వారికి పీఆర్సీలతో సంబంధం లేదా?’’ అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని… ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేశారని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.