కాంగ్రెస్‌కి కిరణ్‌ కుమార్‌రెడ్డి బైబై.. బీజేపీ వ్యూహం మాములుగా లేదుగా!

దివంగత నేత మాజీ సీఎం రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆపద్కాల ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి.. త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఆయన పార్టీ మారే విషయం దాదాపు కన్ఫామ్‌ అయినట్లు సమాచారం. రేపు, ఎల్లుండిలో బీజేపీలో చేరుతారని ఆయన అనుచరులు అంటున్నారు. బీజేపీ అగ్రనేతల సమక్షంలోనే ఆ పార్టీలో చేరవచ్చని… దీనికి ముందుగా కిరణ్‌కుమార్‌ రెడ్డి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొన్నాళ్లుగా రాజకీయ అజ్ఞాతంలో ఉన్న కిరణ్‌కుమార్‌ రెడ్డి.. ఇకపై బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్‌ అవుతారని భావిస్తున్నారు.

కీలక నేతలను చేర్చుకుంటూ బీజేపీ ముందుకు…
రానున్న ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాగోలా నిలదొక్కుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం కోరుకుంటోంది. అందులో భాగంగా రెండు రాష్ట్రాల్లోని ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను బీజేపీలోకి ఆహ్వానించి.. ఎన్నికల్లో ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వ్యూహం రచిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని త్వరలో ఆ పార్టీలో చేర్చుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయితే ఏపీ విభజన సమయంలో ఎంతోకంత పోరాటం చేసిన వ్యక్తిగా ప్రజల్లో నిలిచారు. దీంతోపాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీపై విమర్శలు చేయడానికైనా.. ఇతర పోరాటాలకైనా బీజేపీ తరపున కిరణ్‌కుమార్‌ రెడ్డి గట్టిగా నిలబడే అవకాశం ఉంది. గతంలో జగన్‌ కాంగ్రెస్‌ను వీడి పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి.. జగన్‌ను కొంత వరకు కట్టడి చేశారని చెప్పవచ్చు. మరి బీజేపీలో చేరిన తర్వాత ఏమేరకు ఆయన పనిచేస్తారో చూడాల్సి ఉంది.

ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదిగేలా కృషి..
బీజేపీ ఏపీలో ఎలాగైనా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా పోషించాలని.. అవకాశం ఉంటే అధికారం కూడా దక్కించుకోవాలని ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఏపీలో బలమైన సామాజిక వర్గమైన కాపులకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతోపాటు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి అదేవిధంగా యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా.. తమతోనే ఉండాలని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్‌కు సూచించినట్లు సమాచారం. అయితే పవన్‌ మాత్రం ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ ఇప్పవరకు తనకు రూట్‌ మ్యాప్‌ ఇవ్వలేదని పవన్‌ గతంలో పలుమార్లు తెలిపారు. ఏది ఏమైనా జనసేన అధినేత మరో రెండు, మూడు రోజుల్లో జరగనున్న ఆవిర్భావ సభ వేదికగా… పొత్తుల విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఇటీవల బీజేపీని వీడిని కన్నా లక్ష్మీనారాయణ స్థానాన్ని భర్తీ చేసేందుకు కిరణ్‌కుమార్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తద్వారా రాయలసీమలో బీజీపీని బలోపేతం చేయడంతోపాటు.. ఇతర జిల్లాల్లో కూడా ఆయన పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని బీజేపీ భావిస్తోంది.