YS Jagan ఢిల్లీకి పయనం.. కారణం ఇదేనా?
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు ఇవాళ వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ కానున్నారు. అయితే.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీలో ఇవాళ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పైగా రేపు కూడా దీనిపై సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో అత్యవసరంగా ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అన్న అంశం చర్చణీయాంశంగా మారింది.
రాష్ట్ర సమస్యలు, రాజధాని గురించేనా..
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు ఇతర అంశాలపై సీఎం జగన్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే.. ఈ ఏడాది జూన్ లేదా జులై నుంచి విశాఖ నుంచి పరిపాలన ఉంటుందని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో.. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇక ఈ అంశంపై కూడా ఆయన వారితో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ, షాలతోపాటు మరికొందరు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశముందని సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలను వారికీ జగన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
కోడికత్తి, వివేకా హత్య కేసులపై చర్చ ఉంటుందా..
రాష్ట్రంలో ప్రధానంగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది, దీంతోపాటు కోడికత్తి కేసులో విచారణకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకావాలని ఎన్‌ఐఏ కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు హాజరుకావాలని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు జగన్‌కు స్పష్టం చేసింది. సీఎంతోపాటు పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరుకావాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఉన్నపలంగా సీఎం జగన్ ఢిల్లీ పెద్దలను కలుస్తుండటంపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా కేసులకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో ఆయన మాట్లాడతారా లేదా అన్నది సస్సెన్స్‌గా ఉంది. ఇక సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు జగన్ వెళ్లనున్నారు.. రాత్రి 7.30 గంటలకు ఆయన ఢిల్లీ చేరనున్నారు. శుక్రవారం ప్రధాని, హోమంత్రి, ఇతర మంత్రులను జగన్ కలవనున్నారు.