గోదావరి జిల్లాలపైనే సీఎం జగన్‌ గురి.. ఎందుకంటే?

ఇప్పటి వరకు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తూ.. వాటిని ఎప్పటికప్పడు అర్హులకు అందజేస్తూ వస్తున్న సీఎం జగన్‌.. ప్రస్తుతం సోషల్ ఇంజినీరింగ్‌ వైపు దృష్టి సారించారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో సామాజిక సమీకరణాలపై ఆయన ఫోకస్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలోనే మంత్రి వర్గ విస్తరణ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త కూర్పులో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవి వచ్చేలా లేదు. అవసరమైతే ఇప్పటికే ఉన్న వారిని జగన్‌ మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు సీఎం జగన్‌ దృష్టి అంతా.. టీడీపీ జనసేన పొత్తుపైనే ఉంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలవడం వల్ల ఏఏ జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్‌ జరుగుతుంది. దాన్ని ఏవిధంగా తగ్గించుకోవాలని అన్న అంశాలపై జగన్‌ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

ఆ జిల్లాల్లో కీలక నాయకులకు పదవులు..
ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్ల ప్రాభల్యం ఎక్కువ.. దీంతో ఆ జిల్లాలపై ప్రస్తుతం జగన్‌ ఫోకస్‌ పెట్టారు. అక్కడ కాపుల తర్వాత శెట్టి బలిజల సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉంటారు. అయితే.. కొన్నిచోట్ల కాపులు- శెట్టి బలిజలకు మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో టీడీపీలో జనసేన పొత్తు కొనసాగినా.. కాపుల ఓట్లు ఎంతో కొంత మేర ఓట్లు వైసీపీ లాక్కుని, శెట్టి బలిజల ఓట్లు మొత్తం ఆ పార్టీకే వచ్చేలా జగన్‌ ప్రణాళికలు రచిస్తున్నారంట. ఇందులో భాగంగా ఆయా సామాజిక వర్గాల్లో కీలక నాయకులు, కులాన్ని ప్రభావితం చేసే వారు ఎవరు అన్నదానిపై దృష్టి సారించారంట. ఈమేరకు త్వరలో జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారికి పదవులు కట్టబెట్టి ఓట్లు పోకుండా సీఎం జగన్‌ ప్లాన్‌ వేస్తున్నారని సమాచారం.

సంక్షేమాలు ఎన్ని ఇచ్చినా.. కులాలే ముఖ్యం..
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు ఏవిధంగా ఉంటాయో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం జగన్‌ తనకు మొదటి నుంచి వెన్నంటి ఉండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ వస్తున్నారు. దీంతోపాటు పలువురికి మంత్రి పదవులు ఇచ్చి క్యాబినెట్‌ హోదా కల్పించారు. వీరితోపాటు సొంత సామాజిక వర్గం రెడ్డి కులస్తులకు అనేక పదవులు ఇచ్చారు. ఇటీవల చేసిన రెండో మంత్రి వర్గ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి రాజకీయ సమతుల్యం పాటించారు. ఇప్పటికే జగన్‌ క్యాబినెట్‌లో 25 మంది మంత్రులు ఉన్నారు. అందులో ముగ్గురు రెడ్లు, అయిదుగురు కాపులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు, మిగిలిన వారు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు పదవులు అనుభవిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపొందాలంటే.. కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడితే సరిపోదని జగన్‌ భావిస్తున్నారు. వీటితోపాటు కుల సమీకరణాలు కూడా అవసరమని భావిస్తున్నారు. ఆ మేరకు మూడో దఫా మంత్రి వర్గ కూర్పు ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. పైకి పనితీరు ఆధారంగా మంత్రులను తొలగిస్తున్నాం అని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం సామాజిక, రాజకీయ సమీకరణాలతో మంత్రి వర్గ విస్తరణ సీఎం జగన్‌ చేపడతారని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.