జగన్‌కి పబ్‌జీ ఆడుకోవడమే వచ్చు – బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

హిందూపూర్‌ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ… ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. ‘జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యం. పరిశ్రమలు రాలేదు.. ఉపాధి కల్పన జరగలేదు. రాష్ట్రమంతటా ల్యాండ్, శాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ కేసులతో వేధిస్తున్నారని’ బాలయ్య ఆరోపించారు. ఈ సందర్బంగా అనంతపురం జిల్లా శింగనమలలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్‌ పాదయాత్ర యువతరానికి స్ఫూర్తి అని అన్నారు. గతంలో యువత కోసం తెదేపా ఏం చేసిందో ఆయన చెబుతున్నారని.. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న లోకేశ్‌కు అన్ని వర్గాల ప్రజలను మద్దతు లభిస్తోందన్నారు.

ఏపీ సర్వనాశనమైపోయింది..
వైకాపా పాలనలో ఏపీ సర్వనాశనమైందని బాలయ్య విమర్శించారు. రాష్ట్రంలో పేదవాళ్లు బతికే పరిస్థితి లేదని.. చెత్తపైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితి ఏపీలో ఉందన్నారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ఏపీ ప్రజలు వలసలు వెళ్లాల్సి వస్తుందన్నారు. వైకాపా ఎమ్మెల్యేల్లో చాలా మందిలో అసంతృప్తి ఉందని.. తమతో వారు టచ్‌లో ఉన్నారన్నారు. తెదేపాలో చేరి ప్రజాసేవ చేద్దామని వారు అనుకుంటున్నారని.. సీఎం జగన్‌కు పబ్‌జీ ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.