నామినేషన్లు దాఖలు చేసిన ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ నుంచి అధికార పార్టీ వైసీపీకి చెందిన ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు. వారందరూ ఆయా ప్రాంతాల్లో గురువారం తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. తొలుత ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఏడుగురు అభ్యర్ధులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బి–ఫారంలను అందజేశారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను వారు కలిసి బి–ఫారంలను అందుకున్నారు. ఈ సందర్బంగా శాసనమండలి సభ్యులుగా పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ అభ్యర్ధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల వెంట పలువురు వైసీపీ నాయకులు..
ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా అభ్యర్థులతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి అంబటి రాంబాబు, ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, లావు శ్రీ కృష్ణ దేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, నంబూరి శంకర్ రావు, ఉండవల్లి శ్రీదేవి, దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలసిల రఘురామ్, జంగా కృష్ణ మూర్తిలు ఉన్నారు.

వైసీపీ నుంచి అభ్యర్థులు వీరే..
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే.. పెనుమత్స సూర్యనారాయణ, కోలా గురువులు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయిల్, జయమంగళం వెంకటరమణ, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్.

తెలంగాణలో ముగ్గురు..
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురు గురువారం ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో దేశపతి శ్రీనివాస్‌, వెంకట్రామ్‌రెడ్డి, నవీన్‌ కుమార్‌ నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్‌ సందర్భంగా మంత్రులు హరీష్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు.