హైద‌రాబాద్‌లో రూ.10కే బ్యాగ్!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశ వ్యాప్తంగా హానికరమైన ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగాన్ని నిషేధించాలని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చర్యలు చేపట్టింది. అయితే ఇప్పుడిప్పుడే.. అన్ని ప్రాంతాల్లో నిబంధనలు కటినతరం చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా చైతన్యం వస్తోంది. ఈక్రమంలో హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్లాస్టిక్‌ నియంత్రణే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. మనం ఇప్పటి వరకు డబ్బులు వచ్చే ఏటీఎంలు, డబ్బులు వేస్తే నీరు వచ్చే కుళాయిలు, బరువు చూసుకునే వెయింగ్‌ మెషిన్లను చూస్తుంటాం. అదే విధంగా ఎనీ టైమ్‌ సెంటర్‌ను జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. దీనిని ప్రయోగాత్మకంగా కూకట్‌పల్లి ఫ్రూట్ మార్కెట్ పక్కన ఏర్పాటు చేశారు. పది రూపాయల నోటు మిషన్‌లో పెడితే.. మనం మంచి క్వాలిటీ ఉండే బ్యాగును పొందవచ్చు. ఇది విజయవంతం అయితే.. రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎనీ టైమ్‌ బ్యాగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.