యాంక‌ర్‌గా ఐకాన్​ స్టార్​!

వెండితెరపై హీరోలుగా రాణిస్తూనే బుల్లితెరనూ ఏలేస్తున్నారు టాలీవుడ్​ హీరోలు. మెగాస్టార్​ చిరంజీవి, కింగ్​ నాగార్జున, నట సింహం బాలకృష్ణ ఇప్పటికే బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఇక వీరి బాటలోనే యంగ్ హీరోలు నాని, జూనియర్ ఎన్టీఆర్, రానాలు కూడా నడిచారు. బుల్లితెర, ఓటీటీల్లో టాక్ షోలు, రియాల్టీ షోలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ టాక్​ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. అది కూడా సాదాసీదా టాక్ షో కాదట, ఏకంగా పాన్ ఇండియా లెవెల్ షో.

గంగోత్రి సినిమాతో హీరోగా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ తనను తాను స్టైలిష్​ స్టార్​గా మలుచుకుని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇక సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు బన్ని. ఇక, ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్​ తండ్రి అల్లు అరవింద్​ తెలుగు కోసం ప్రత్యేకంగా ఆహా ఓటీటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ ప్రారంభించిన దగ్గరనుంచీ ప్రేక్షకులకు వరుస సర్​ప్రైజ్​లు ఇస్తూనే ఉంది. స్టార్​ హీరోయిన్​ సమంతను సామ్​ జామ్​ షోతో వ్యాఖ్యాతగా మార్చేసింది. నందమూరి నటసింహం బాలయ్యను అభిమానులు ఎప్పుడూ చూడని రీతిలో అన్​స్టాపబుల్​ షోతో వ్యాఖ్యాతగా మార్చింది. ఇక ఈ షో రెండు సీజన్​లూ రికార్డు వ్యూస్​లతో చరిత్ర సృష్టించి ఇండియాలోనే టాప్​ టాక్​ షో లిస్ట్​లో చేరిపోయాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్​ని కూడా వ్యాఖ్యాతగా మార్చనున్నారని తెలుస్తోంది. తాజాగా ఆహా ట్విటర్​ అకౌంట్​లో చేసిన ట్వీట్​తో ఈ ఊహాగానాలకు ఊపిరి పోసినట్టయ్యింది.

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని మీరు మాస్ గా చూసి ఉంటారు, క్లాస్ గా చూసి ఉంటారు. ఈసారి ఒక బ్లాక్ బస్టర్ లుక్ తో అల్లు అర్జున్ ని మీ ముందుకి తీసుకోని రాబోతున్నాము. బిగ్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి’ అంటూ ట్వీట్ చేసింది. అలాగే అల్లు అర్జున్ న్యూ లుక్ లో ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ.. ఎవరన్నా ఏంటనేది చెప్పగలరా? అని ప్రశ్నించింది. దీంతో కొంతమంది నెటిజెన్లు కొత్త టాక్ షో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇటీవల త్రివిక్రమ్, శ్రీలీల తో ఉన్న అల్లు అర్జున్ పిక్ చూపిస్తూ.. ఆ ఫొటోలోని బన్నీ డ్రెస్ అండ్ గెటప్, ఇప్పుడు రిలీజ్ చేసిన ఫొటోలోని డ్రెస్ అండ్ గెటప్ సేమ్ ఉందంటున్నారు అభిమానులు. మరికొందరేమో ఆహాకి సంబంధించిన కొత్త యాడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏంటనేది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటించే వరకూ ఎదురు చూడాల్సిందే. ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల తన కొత్త ప్రాజెక్ట్ ని కూడా అనౌన్స్ చేశాడు. సూపర్​ హిట్​ సినిమా అర్జున్​ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్​ పూర్తయిన వెంటనే ఈ సినిమా ప్రారంభమవనున్నట్లు తెలుస్తోంది.