Amitabh: ట్రాఫిక్‌ వ‌ల్ల‌ లిఫ్ట్ అడిగి షూటింగ్‌కి వెళ్లిన బిగ్‌బి!

Mumbai: బాలీవుడ్ (Bollywood) బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షూటింగ్‌ లొకేషన్ కు సమయానికి చేరుకోవడం కోసం ఆయన చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. అంత పెద్ద స్టార్ నటుడు అయ్యి కూడా సమయానికి లొకేషన్‌కు చేరుకోవాలని కారు దిగి బైక్ ఎక్కారు. అది కూడా లిఫ్ట్ అడిగి.
అమితాబ్ బచ్చన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా సమయానికి చేరుకుంటారు. అదే ఆయనను సూపర్ స్టార్‌‌ను చేసింది. ఇటీవల అమితాబ్ సినిమా షూటింగ్‌కు బయలుదేరారు. దారిలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆయన అక్కడ చిక్కుకున్నారు. ఒక పక్క షూటింగ్‌కు టైం అవుతోంది. దీంతో ఆయన తన కారు దిగి.. పక్కనే బైక్ పై ఉన్న యువకుడిని లిఫ్ట్ అడిగారు. బైక్‌ పై షూటింగ్ లొకేషన్‌కు చేరుకున్నారు. అనంతరం, సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు, ఒక ఫోటోను కూడా ట్యాగ్ చేసి దాని కింద ఈ విధంగా రాశారు. ‘రైడ్ ఇచ్చిన బడ్డీకి ధన్యవాదాలు. మీరు ఎవరో తెలియదు. కానీ మీరు నన్ను షూటింగ్ స్పాట్‌కు సమయానికి చేర్చారు. ట్రాఫిక్ జామ్‌ సమస్యలో చిక్కుకున్న నాకు సహాయం చేశారు. ధన్యవాదాలు. మీరు షార్ట్ వేసుకుని పసుపు రంగు టీ -షర్టు ధరించి, క్యాప్ పెట్టుకున్న బైక్ యజమాని’ అని ఇన్‌ స్టాగ్రామ్‌ (Instagram)లో రాసుకొచ్చారు. కాగా, ప్రస్తుతం అమితాబ్ బచ్చన్.. ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌ కె (Project K) సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘అమితాబ్ మీరు నిజంగానే సూపర్ స్టార్’ అని కామెంట్స్ చేస్తున్నారు.