amarnath yatra: ఆన్‌లైన్ బుకింగ్స్ మొదలు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఇవే!
srinagar: దక్షిణ కశ్మీర్(south kashmir)లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి ఏటా భక్తులు పెద్దఎత్తున తరలి వెళ్తుంటారు. ఈ వార్షిక యాత్ర ఈసారి జులై 1న ప్రారంభమై ఆగస్టు 31వరకు కొనసాగనుంది. ఈనేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర(Amarnath Yatra)కు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దాదాపు 62 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో పాల్గొనాలనుకు వారు.. ముందుగా.. అమర్‌నాథ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గతేడాది మాత్రం మాన్యువల్‌గానే యాత్రికులకు దరఖాస్తులు అందజేశారు. ఈ సారి మాత్రం వెబ్‌సైట్‌ను రూపొందించి.. ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల అక్కడ ఏర్పాట్లను అధికారులు చేసుకునేందుకు వీలుంటుంది. ఇక ఈ యాత్రలో పాల్గొనే వారు వెబ్‌సైట్ లో అడిగిన విధంగా తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, ఇతర వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. దీంతోపాటు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి రెండు మార్గాల ద్వారా యాత్ర యాత్ర కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించేలా లైవ్ టెలికాస్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా 13 లోపు పిల్లలు, 75 ఏళ్లు నిండిన వృద్ధులను.. యాత్రకు అనుమతించబోమని తెలిపారు. ఈ ఏడాది ప్రత్యేకంగా బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్లతోపాటు.. వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని అంటున్నారు. ఒకవేళ వెబ్‌సైట్‌లో నమోదు గురించి అవగాహన లేని వారు.. నేరుగా.. ప్రభుత్వ బ్యాంకుల వద్దకు వెళ్లి.. రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెబుతున్నారు. మరోవైపు, జమ్మూలో ఓ పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖను పువ్వులతో అందంగా ముస్తాబు చేశారు. సోమవారం నుంచే రిజిస్ట్రేషన్లు మొదలైన నేపథ్యంలో బ్యాంకుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చి పేర్లు నమోదు చేసుకున్నారు.