బీటెక్ సర్టిఫికేట్ అందుకున్న వర్మ.. వద్దని చెప్పినా వినలేదట
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు బీటెక్ సర్టిఫికేట్ అందుకున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వర్మ బీటెక్ చదివారు. 1985లో ఆయన ఈ కాలేజ్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసారు. అయితే కాలేజ్ అయిపోయాక డిగ్రీ పట్టా మాత్రం తీసుకోలేదు. ఆ తర్వాత దర్శకత్వం వైపు వెళ్లిపోయారు. అయితే ఆచార్య నాగార్జున కాలేజ్ వారు రామ్ గోపాల్ వర్మను ఆహ్వానించారు. ఇప్పుడున్న స్టూడెంట్స్‌తో సరదాగా మాట్లాడాలని కోరారట. ఈ నేపథ్యంలో అక్కడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ నుంచి వర్మ సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విటర్ ద్వారా తనదైన స్టైల్‌లో వెల్లడించారు.
నేను బీటెక్ పాసైన 37 ఏళ్ల తర్వాత సర్టిఫికేట్ అందుకున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది. నేను ఇప్పటివరకు ఈ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోలేదంటే నాకు సివిల్ ఇంజినీరింగ్ అంటే ఇష్టం లేదు. చదువురాని నేను బాగా చదివిని ప్రొఫెసర్లతో కలిసి చర్చించాను. నేను ఈ గౌరవానికి అర్హుడిని కాను అని చెప్పినా కూడా కాలేజ్ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు వినలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్‌ను చెడగొట్టడానికి వెళ్లాను కానీ వారే తమ ఇంటెలిజెన్స్‌తో నన్ను చెడగొట్టేసారు. నాకు ఈ గౌరవ సన్మానాలు చూస్తే భయంకరంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం ఎంతో గౌరవంగా ఫీలయ్యాను. అని ట్వీట్ చేసారు వర్మ.