హీరోయిన్ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్
సాధారంగా హీరోయిన్ల గురించి అసభ్యకరమైన కామెంట్లు చేసేవారి నుంచి దూరంగా ఉండటానికి వారు కొందరు యూజర్లను బ్లాక్ చేస్తుంటారు. కానీ ఒక హీరోయిన్‌తో కలిసి పనిచేసి.. ఆ హీరోయిన్నే కారణం లేకుండా ట్విటర్లో బ్లాక్ చేసాడు స్టార్ హీరో. అతను ఎవరో కాదు. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అవును.. బన్నీ తనతో కలిసి ఓ సినిమాలో నటించిన హీరోయిన్ను ట్విటర్లో బ్లాక్ చేసాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు. భానుశ్రీ మెహ్రా. 2010లో వచ్చిన వరుడు సినిమాలో బన్నీ, భాను జంటగా నటించిన సంగతి తెలిసిందే. కానీ సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. సినిమాలోని ఐదు రోజుల పెళ్లి పాట మాత్రం ఇప్పటికీ పెళ్లిళ్లలో మారుమోగిపోతోంది.
అయితే.. కొన్ని కారణాల వల్ల బన్నీ.. భాను ఖాతాను బ్లాక్ చేసారట. ఈ విషయాన్ని భాను స్వయంగా వెల్లడించింది. “మీరు జీవితంలో ఏమీ సాధించలేదు అని ఫీలవుతుంటే.. ఒకసారి నన్ను తలుచుకోండి. అల్లు అర్జున్‌తో కలిసి వరుడు సినిమాలో నటించినప్పటికీ నాకు ఇప్పటివరకు ఛాన్సులు రాలేదు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న కష్టాల నుంచే హాస్యాన్ని నేర్చుకున్నాను. అందులోనూ అల్లు అర్జున్ నన్ను ట్విటర్లో బ్లాక్ చేసారు” అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే బన్నీ ఆమెను అన్‌బ్లాక్ చేసారు. ఈ విషయాన్ని కూడా భానునే వెల్లడించారు.
“మొత్తానికి బన్ని నన్ను అన్‌బ్లాక్ చేసారు. నేను ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. నా కెరీర్లో ఎదుగుదల లేకపోవడానికి నేను ఎప్పుడూ అల్లు అర్జున్‌ని తప్పుబట్టలేదు. దాని బదులు నా కష్టాల నుంచే హాస్యాన్ని నేర్చుకుని ముందుకెళుతున్నాను. నా యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నేను మాటిస్తున్నాను. నా సినీ కెరీర్ కంటే నా ఛానెల్లోని కంటెంట్ ఇంకా ఎంటర్టైనింగ్గా ఉంటుంది” అని పేర్కొంది. అయితే ఇదంతా అటెన్షన్ కోసమే చేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.