Akash Deep: కుర్రోడే కానీ మహానుభావుడు..!
Akash Deep: ఇంగ్లండ్‌తో జరగబోయే చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును BCCI శనివారం (ఫిబ్రవరి 10) ప్రకటించింది. విరాట్ కోహ్లీ (Virat Kohli) వ్యక్తిగత కారణాల వలన మిగిలిన టెస్టుల నుంచి తప్పుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయ్యర్ గాయం కారణంగా సెలక్టర్లు పక్కన పెట్టారు. జడేజా (Ravindra Jdeja), రాహుల్ (KL Rahul) పూర్తి ఫిట్ నెస్ సాధించకపోయినా ఎంపిక చేసింది. ఇంతమంది స్టార్ ల మధ్య ఒక కొత్త కుర్రాడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడనే విషయం ఎవరూ గమనించలేదు. అతడెవరో కాదు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్.
బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ తొలిసారిగా టెస్టు జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కింది. తొలి రెండు టెస్టులకు ఎంపికైన అవేశ్ ఖాన్‌ను పక్కనపెట్టి మరి సెలెక్టర్లు ఆకాశ్ దీప్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు ఎంపికైనప్పటికీ ఆకాష్‌కు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యాడు.
ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికార టెస్టు సిరీస్‌లో కూడా ఆకాష్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన దీప్ 13 వికెట్లు పడగొట్టి.. భారత్-ఏ జట్టు తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు బీసీసీఐ తొలి రెండు టెస్టులకు మాత్రమే జట్టును ప్రకటించింది. రెండవ గేమ్ ముగిసిన తర్వాత, బోర్డు మిగిలిన మ్యాచ్‌లకు ఆటగాళ్లను పేర్కొంది. ప్రస్తుతం చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును ప్రకటించినప్పుడు పేసర్ ఆకాష్ దీప్ అందరి దృష్టిని ఆకర్షించాడు.
27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్ వైపు అడుగులు వేశాడు.
తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్‌లోని ఓ క్రికెట్ ఆకాడమీలో దీప్ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్‌లోని ఖేప్ క్రికెట్’ టెన్నిస్ బాల్ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ డివిజన్ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ లభించింది.
ఆకాష్ దీప్ అంతకముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పటికే భారత టెస్ట్ జట్టులో మరో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గతంలో బెంగాల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
ఇంగ్లండ్‌తో మూడు టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్