Aeroplane: ఆకాశంలో తగ్గనున్న వేగం
Aeroplane: మనం సాధారణంగా బైక్‌లు, ఆటోలు, క్యాబ్‌లు, కార్లలో వెళ్తుంటే ట్రాఫిక్ని బట్టి బండి వెళ్తుంటుంది. ట్రాఫిక్ లేకపోతే వేగంగా వెళ్తాయి. ఇక హైవేల విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైళ్ల విషయానికొస్తే.. వారికి స్టేషన్ల నుంచి వచ్చే సిగ్నల్స్‌కి బట్టి వేగంగా వెళ్లడం.. ఎక్కడైనా కొంతసేపు ఆగడం వంటివి చేస్తుంటాయి. మరి విమానాల విషయంలో ఏం జరుగుతుంది? ఎయిర్ ట్రాఫిక్, రన్‌వేలపై సమస్యలు, ఎయిర్‌పోర్ట్‌లో లోపాల వల్ల విమానాల ప్రయాణ వేగాన్ని తగ్గించవచ్చా? తప్పకుండా తగ్గించవచ్చు. అందుకే 5 గంటలకు రావాల్సిన విమానం 10 గంటలు లేట్ అయ్యిందని బోలెడు వార్తలు వింటుంటాం.
అయితే.. ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్న గ్లోబల్ వార్మింగ్‌లో 4 శాతం ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి వెలువడే పొల్యూషన్ వల్లే కలుగుతోందట. అందులో 2.5 శాతం కార్బన్ డైయాక్సైడ్ వల్ల ఏర్పడుతోంది. ఈ కార్బన్ డైయాక్సైడ్‌ను తగ్గించి గ్లోబల్ వార్మింగ్‌ను కొంతైనా తగ్గించాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాల ప్రయాణ వేగాన్ని 15 శాతం తగ్గించాలి. అంటే.. ఇండియా నుంచి అమెరికాకు వెళ్లాలంటే 24 గంటలు పడుతుంది అంటారు. ఈ విమాన వేగాన్ని 15 శాతం తగ్గిస్తే.. 25 గంటల్లో అమెరికాకు చేరుకోవచ్చు. అంటే వేగాన్ని 15 శాతం తగ్గిస్తే ఒక గంట ప్రయాణం ఆలస్యం అవుతుందన్నమాట.
ఇది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే అంశం అయినప్పటికీ మన భూగ్రహాన్ని గ్లోబల్ వార్మింగ్ నుంచి కాపాడుకోవాలంటే మనవంతు కూడా ఏదన్నా చేయాలి అన్న ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఏవియేషన్ రంగాలకు ఈ సమాచారాన్ని చేరవేసారు. 15 శాతం తక్కువ వేగంతో విమానాలు ప్రయాణిస్తే 7 శాతం వరకు చమురును ఆదా చేయచ్చు. ఎటూ ప్రయాణ సమయాన్ని పెంచుతున్నాం కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లలో వెయిటింగ్ సమయాలను తగ్గిస్తే ప్రయాణికులకు అంత అసౌకర్యం ఉండదని కూడా చెప్తున్నారు. కావాలంటే తక్కువ వేగంతో ప్రయాణించే విమానాలను తయారుచేసేలా కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అంశాలపై ఏవియేషన్ అధికారుల అనుమతి కంటే ప్రయాణికుల అనుమతి ఎంతో ముఖ్యం. ప్రయాణ సమయం పెరిగితే వారు ప్రయాణించడమే మానేస్తారు అనే భయం ఉంది.
ఈ అంశాలపై శాస్త్రవేత్తలు న్యూయార్క్‌కి చెందిన ఏవియేషన్ ఇండస్ట్రీ అధికారులకు ఓ నివేదికను అందజేయనున్నారు. అలా ఒక్కో దేశంలో దీనిని అమలు చేసే అవకాశం ఉంది. కాకపోతే దీనికి చాలా సమయం పడుతుంది.