ఏఈ, ఏఈఈ పరీక్షల తేదీలు ప్రకటించిన TSPSC

టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వివాదం నడుస్తున్న తరుణంలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. ఇప్పటికే రద్దు చేసిన తేదీలను ప్రకటించింది. ఇటీవల ర‌ద్దు చేసిన ఏఈఈ ( AEE ) నియామ‌క ప‌రీక్ష‌ల తేదీల‌ను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్ర‌క‌టించింది. మే 8వ తేదీన ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ పోస్టుల‌కు, 9న అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మే 21న సివిల్ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్, అగ్రిక‌ల్చ‌ర్, మెకానిక‌ల్ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో, సివిల్ పోస్టుల‌కు ఓఎంఆర్ ప‌ద్ధ‌తిలో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. పూర్తి వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను చూడాలని అధికారులు సూచించారు.

ఆన్‌లైన్‌ విధానానికి ప్రాధాన్యం..
పరీక్ష పత్రాలు లీకైనట్లు తేలడంతో టీఎస్‌పీఎస్సీ అప్రమత్తమైంది. ఇక ఎక్కువ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలోనే నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్స్, డీఏవో మినహా మిగిలిన పరీక్షలు అన్నీ ఆన్​లైన్​లోనే నిర్వహించనుంది. గతేడాది 17 వేలకుపైగా పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ 26 నోటిఫికేషన్లు రిలీజ్ చేయగా… ఇందులో దీంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తోపాటు ఏడు పరీక్షలు నిర్వహించింది. అయితే, క్వశ్చన్ పేపర్ లీక్ తో వీటిలో నాలుగు పరీక్షలను రద్దు చేసింది. మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది. ఏప్రిల్​లో జరగాల్సిన మరో 4 పరీక్షలను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలు అన్ని అంటే.. లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చిన వాటిని ఆఫ్ లైన్​ విధానంలో నిర్వహించి అంతకు లోపు ఉన్న పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు కావడంతో, జూన్ 11 నిర్వహిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ పరీక్షను యథావిధిగా జూన్​ 11న, జులై 1న గ్రూప్ 4 పరీక్షనూ నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. అయితే, పరీక్షపై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జామ్ ను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. ఈ పరీక్షను జూన్ 17న నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.