జగన్‌ను తిట్టిన సింగర్.. క్లాస్ పీకిన నెటిజన్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కామెంట్స్ చేసి నెటిజన్ల చేత క్లాస్ పీకించుకున్నారు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి. ఈ రచ్చ మొత్తం జగన్ చేసిన ఒక ట్వీట్ వల్ల మొదలైంది. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ట్వీట్ చేస్తూ.. “తెలుగు జెండా మరింత ఎత్తున ఎగురుతోంది. మన తెలుగు వారసత్వ సంపద గురించి చక్కగా వర్ణించిన తెలుగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చినందకు నా మనసు ఉప్పొంగిపోతోంది” అని ట్వీట్ చేసారు. అయితే జగన్ చేసిన ట్వీట్ అంతా బాగానే ఉంది కానీ ఆయన తెలుగు జెండా అని సంబోధించడం గాయకుడు అద్నాన్ సమీకి రుచించలేదు. దాంతో సీఎం అని చూడకుండా ఆయన్ను ట్విటర్‌లో విమర్శించారు.
“ప్రాంతీయత గురించే ఆలోచిస్తూ ఓ చిన్న కొలనులో ఉండే కప్ప మహాసముద్రం గురించి ఏం ఆలోచిస్తుంది! జాతీయత పట్ల గర్వం ప్రదర్శించకుండా ప్రాంతీయంగా విబేధాలు సృష్టించడానికి సిగ్గుండాలి ” అని ట్వీట్ చేసారు. దాంతో కొందరు నెటిజన్లు అద్నాన్ సమీ వ్యాఖ్యలను తప్పబడుతున్నారు. తెలుగు పాటకు ఆస్కార్ వచ్చినందుకు సాటి తెలుగువాడిగా ఆయన గర్వపడుతుంటే మధ్యలో మీకేం నొప్పి అంటూ కామెంట్లు చేస్తున్నారు. పక్క దేశం నుంచి వచ్చి పౌరసత్వాన్ని పొందినంతమాత్రాన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగోదని మండిపడుతున్నారు. దాంతో అద్నాన్ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ మరో ట్వీట్ చేసారు. “నా ఉద్దేశం ఒక్క భాష గురించి అని కాదు. ఎన్ని భాషలున్నా, ఎన్ని యాసలున్నా ముందు మనం భారతీయులం ఆ తర్వాతే ఏదైనా. అంతే. నేను అన్ని భాషల్లో ఎన్నో పాటలు పాడాను, అన్ని భాషల పట్ల నాకు గౌరవం ఉంది” అని తెలిపారు.
గతంలో నాటు నాటుకు గ్లోబల్ అవార్డు వచ్చినప్పుడు కూడా జగన్ తన ట్వీట్‌లో “తెలుగు జెండా” అని సంబోధించారు. అప్పుడు కూడా అద్నాన్.. ఆయన ట్వీట్‌ను తప్పుబడుతూ.. “తెలుగు జెండా ఎక్కడుంది. ఉన్నది భారతీయ జెండా” అని తప్పుబట్టారు.