Adipurush:హనుమాన్​ జయంతి సందర్భంగా పోస్టర్​ రిలీజ్​!

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగారు యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​. ఆ తర్వాత చేసిన ఏ పాన్ ఇండియా సినిమా ప్రభాస్​ అభిమానులను మెప్పించలేకపోయింది. సాహో ఫర్వాలేదనిపించినా, రాధేశ్యామ్​ మాత్రం డిజాస్టర్​గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్​ నటిస్తున్న తాజా సినిమాల విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్​ కన్నడ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో సలార్​, బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్​ కాంబినేషన్లో ఆదిపురుష్​ సినిమాల్లో నటిస్తున్నారు. కాగా ఆదిపురుష్​ సినిమా ఆరంభం నుంచే పలు వివాదాలను ఎదుర్కొంటోంది. ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​ పైనా వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్ .కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. కానీ టీజర్ రిలీజ్ తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శించారు. ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేశారు. మొదట ఈ సినిమాని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఈ విమర్శలు చూసి మరింత గ్రాఫిక్ వర్క్స్ చేయాలని సినిమాని 16 జూన్ 2023కి వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ టీమ్‌ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ ఓం రౌత్ ను, చిత్రయూనిట్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఆదిపురుష్ అప్డేట్ ఇవ్వమని అడగడంతో చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్నారు. ప్రభాస్, కృతి సనన్ తో పాటు, లక్ష్మణుడు, ఆంజనేయుడు క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే ఈ పోస్టర్ కూడా గ్రాఫిక్ పోస్టర్ లాగే ఉండటంతో మరోసారి ఆదిపురుష్ పై ట్రోల్స్ వచ్చాయి. అలాగే అందులో సీతకు మెడలో తాళి, ఆభరణాలు లేకపోవడం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం, లక్ష్మణుడికి గడ్డం ఉండటం.. ఇలా అనేక వాటిపై కూడా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు. ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు. ఈ పోస్టర్​తో ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023నే విడుదలవుతుందని మరోసారి ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇన్ని వివాదాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి!