Adipurush: పోస్టర్‌పై ముంబైలో కేసు నమోదు!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదలు పెట్టినప్పటినుంచీ వివాదాలే. నిజానికి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఈ సినిమా టీజర్ విడుదలైన తర్వాత హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ‘అసలు సీతారాముల వేషధారణ ఇలా ఉంటుందా?, ఇదేం రామాయణం?’ అంటూ చిత్రబృందాన్ని దర్శకుడిని తిట్టిపోశారు. విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం బాగోలేదని, యానిమేషన్ సినిమా చూస్తున్నట్టు ఉందని, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలే కనిపించటం లేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ వచ్చాయి. దాంతో సినిమా నిర్మాణంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు విడుదల వాయిదా వేసింది చిత్ర యూనిట్. దర్శకధీరుడు రాజమౌళి సలహాలు కూడా తీసుకుని తగిన మార్పులు చేసేందుకు ప్రయత్నించింది. కాగా, శ్రీరామ నవమి రోజు విడుదలైన పోస్టర్ సైతం బాగోలేదంటూ ట్రోల్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా పోస్టర్ విషయంలో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఓ మతానికి చెందిన వ్యక్తి కేసు కూడా పెట్టారు. దీంతో పోలీసులు సినిమా దర్శకుడు, నిర్మాత, నటీనటులపైనే కేసు నమోదు చేశారు.
ముంబైకి చెందిన సనాతన భోధకుడైన సంజయ్ దీనానాథ్ తివారి అనే వ్యక్తి ఆదిపురుష్ సినిమా డైరెక్టర్, నిర్మాతపై కేసు పెట్టారు. ఈ పోస్టర్లో చిత్రనిర్మాత హిందూ మత సమాజంలోని మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం సెక్షన్ 295 (A), 298, 500, 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబైలోని సకినక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోస్టర్‌లోని శ్రీరాముని వేషధారణ.. రామచరితమానస్లో చెప్పినట్లు సహజ స్ఫూర్తికి, స్వభావానికి విరుద్ధంగా ఉందని, జంధ్యంలేని రాముడి కథ ఎలా ఉంటుందంటూ.. ఫిర్యాదులో తెలిపారు. హిందూ సనాతన ధర్మంలో జంధ్యంకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని, రామాయణంలోని పాత్రలను జంధ్యం లేకుండానే ఆది పురుష్ పోస్టర్లో చూపించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఆది పురుష్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆది పురుష్ చిత్రంలో శ్రీరాముడుగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నగే కనిపిస్తున్నారు. ఇక, లంకాధిపతి రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో టి సిరీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.