అది వెబ్‌సిరీస్ కాదు బ్లూ ఫిలిం: రానా నాయుడు గురించేనా?

విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వెబ్‌సిరీస్‌ రానా నాయుడు. ఇందులో వారిద్ద‌రూ తండ్రీకొడుకులుగా న‌టించారు. వెబ్‌సిరీస్ పేరుతో మితిమీరిన అడ‌ల్ట్ కంటెంట్ ఉన్నందున ఈ వెబ్‌సిరీస్‌పై ఇప్ప‌టికే నెటిజ‌న్ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ ప‌ర్సన్‌ను పెట్టి ఇలాంటివి తెర‌కెక్కించ‌డం స‌మంజ‌సం కాద‌ని అందులోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇలాంటివి అస్స‌లు న‌చ్చ‌వ‌ని తెలిపారు. ఇప్ప‌టికే సినీ న‌టి, బీజేపీ నేత విజ‌య‌శాంతి కూడా ఈ వెబ్‌సిరీస్‌పై ప‌రోక్షంగా కామెంట్లు చేసారు. ఓటీటీ కంటెంట్‌కి కూడా సెన్సార్ ఉండాల‌ని, మ‌హిళా సంఘాలు ధ‌ర్నాలు చేసే ప‌రిస్థితిని తెచ్చుకోవ‌ద్ద‌ని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా ఈ వెబ్‌సిరీస్‌పై సినీ న‌టుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు శివ‌కృష్ణ స్పందించారు. రానా నాయుడు పేరు తీయ‌కుండా ప‌రోక్షంగా ఇటీవ‌ల వ‌చ్చిన ఓ వెబ్‌సిరీస్ అంటూ వ్యాఖ్యానించారు. “నేను ఇటీవ‌ల తెలుగు, హిందీలో రిలీజ్ అయిన ఓ వెబ్‌సిరీస్ చూసాను. అందులో కంటెంట్ చూసి అస‌హ్యం వేసింది. అది వెబ్‌సిరీస్‌లా లేదు. బ్లూ ఫిలింలా ఉంది. ఇంట్లో బెడ్ రూం, కిచెన్ ఉంటాయి. బెడ్‌రూం తలుపులు తెరిచిపెట్టి ఉంచుతారా? ఇలాంటివి మ‌న సంప్ర‌దాయ‌మేనా అస‌లు. ఇది ఫ్యామిలీతో ఎలా చూస్తాం? ఇలాంటివి పిల్ల‌లు చూస్తే ఏమనుకుంటారు? వాళ్లు చెడిపోతున్నది కూడా ఇలాంటివాటి వ‌ల్లే. ఓటీటీ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇలాంటివి ఎక్కువ అయిపోయాయి. ఓటీటీ కంటెంట్‌కి కూడా సెన్సార్ ఉండాలి. థియేట‌ర్లలో ఇలాంటివి రిలీజ్ చేస్తే వెళ్లి చూసేవారికే తెలుస్తుంది. కానీ ఓటీటీల‌తో ఇది సాధ్యం కాదు. పిల్ల‌లు ఓటీటీ కంటెంట్‌కు బాగా అల‌వాటుప‌డిపోతున్నారు. మ‌న దేశం ఆర్థికంగా ప‌డిపోతే మ‌ళ్లీ కోలుకుంటుందేమో కానీ ఇలా సంప్ర‌దాయాల ప‌రంగా ప‌డిపోతే మాత్రం మ‌ళ్లీ కోలుకోదు” అని మండిప‌డ్డారు.