AB de Villiers: విరాట్ కోహ్లీ గురించి తప్పుగా చెప్పా.. సారీ
AB de Villiers: ప్రముఖ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. విరాట్ కోహ్లీకి (Virat Kohli) క్షమాపణలు చెప్పారు. ఇటీవల డివిలియర్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడని ప్రకటించేసారు. దాంతో విరాట్ కోహ్లీ తాను తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని బయటికి చెప్పకుండా ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి టెస్ట్ మ్యాచెస్ నుంచి తప్పుకుంటున్నాడని ఒకవైపు విమర్శలు మరో వైపు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
విరాట్ భార్య అనుష్క శర్మ (Anushka Sharma) గర్భం దాల్చారన్న విషయం 90 శాతం కన్ఫామ్ అయిపోయింది. అందుకే అనుష్క బయటికి రావడంలేదు. ఒకవేళ వచ్చినా గర్భం కనిపించకుండా ఉండేందుకు భారీ దుస్తులు వేసుకుని వస్తోంది. మీడియా ఎక్కడ ఫోటోలు తీసేస్తుందో అని భయపడి వారికి స్పెషల్‌గా రిక్వెస్ట్ కూడా పెట్టింది. సమయం వచ్చినప్పుడు తానే అన్నీ ప్రకటిస్తానని.. అప్పటివరకు తన ఫోటోలు తీయొద్దని పేర్కొంది.
ఇంత పకడ్బందీగా తమ రెండో సంతానాన్ని ప్లాన్ చేసుకుంటన్న విరాట్ దంపతులకు డివిలియర్స్ నుంచి గట్టి షాక్ తగిలింది. సాధారణంగా ఏ సెలబ్రిటీ కూడా మరో సెలబ్రిటీ సీక్రెట్లు కానీ పర్సనల్ విషయాలు కానీ మీడియాతో పంచుకోరు. దాని వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా అందరికీ తెలుసు. కానీ డివిలియర్స్ ఏమనుకున్నాడో ఏమో విరాట్ తండ్రి కాబోతున్నాడు అని ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసాడు.
దాంతో సోషల్ మీడియాలో అనుష్క శర్మ హ్యాష్‌ట్యాగ్ దాదాపు ఐదారు గంటల పాటు ట్రెండ్ అయ్యింది. చాలా మంది సెలబ్రిటీలు అనుష్క, విరాట్‌లను ట్యాగ్ చేస్తూ కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. మరోపక్క విరాట్‌కి అత్యంత దగ్గరి స్నేహితులు, సన్నిహితులు మాత్రం తమ ద్వారా కాకుండా డివిలియర్స్ ద్వారా మ్యాటర్ ఎలా లీకైంది అన్న ఆలోచనలో పడ్డారు. అనుష్క తొలిసారి గర్భం దాల్చినప్పుడు తనకు ఆరో నెల వచ్చేవరకు బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. వారి ప్రెగ్నెన్సీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది.
కానీ రెండో ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం డివిలియర్స్ ప్రకటిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఆ ప్రకటన తర్వాత డివిలియర్స్‌కు వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయట. దాంతో ఆయన చేసిన తప్పేంటో తెలుసుకుని విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెప్పారు. విరాట్ కోహ్లీ తండ్రి కాబోతున్నాడు అనే విషయం పూర్తిగా అబద్ధమని.. తనకు తెలీక అలా అనేసానని అన్నాడు. విరాట్ కుటుంబంలో ఏం జరుగుతోందో తనకు కూడా తెలీదని.. తనకే కాదు ఎవ్వరికీ తెలీదని.. అలా తెలిసీ తెలీని సమాచారాన్ని మీడియా ముందు పెట్టేసినందుకు విరాట్‌ను క్షమించమని అడుగుతున్నానని తెలిపారు.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ కొన్ని టెస్టులకు దూరంగా ఉంటున్నాడు. కారణం అడిగితే ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని కొన్ని సందర్భాల్లో ప్రాక్టీస్ వదిలేసి తిరిగి ముంబై వెళ్లిపోయాడు. దాంతో విరాట్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు అనే ఊహాగానాలకు ఊపందుకుంది. అయితే ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ విరాట్ కానీ అనుష్క కానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. డివిలియర్స్ విషయంలో కూడా విరాట్, అనుష్క ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు.