స్నేహితురాలిపై మోజుపడిన యువతి.. ప్రేమించట్లేదని హత్య!
సాధారణంగా అబ్బాయి… అమ్మాయి ప్రేమించుకోవడం సహజం. ఒకవేళ వీరిద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోవడం కూడా కామన్.. కొన్ని ఘటనల్లో అమ్మాయిపై ప్రేమించిన వ్యక్తి దాడులు చేస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఓ అమ్మాయి… మరో అమ్మాయిని ఇష్టపడింది. ప్రేమిస్తున్నానని వెంటపడింది. చివరికి ఆ యువతి మరో యువకుడిని ప్రేమిస్తోందని తెలియడంతో సదురు యువతి ఆగ్రహించి ప్రేమించిన అమ్మాయిని కడతేర్చింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా మామిడిగట్టుకు చెందిన అంజలి, నెన్నెల మండలం మన్నెగూడకు చెందిన పెరుగు మహేశ్వరి, తన దూరపు బంధువు అంజలి, ఇంకో మిత్రుడు కామెర విఘ్నేష్ కలిసి మంచిర్యాల కాలేజీ రోడ్‌లో రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. మహేశ్వరి తన చిన్ననాటి నుంచి మగవారి లాగా జట్టు కత్తిరించుకోవడం, ప్యాంట్లు ధరించడం వంటివి చేస్తుండేది. ఈక్రమంలో అంజలి, మహేశ్వరి దగ్గరి బంధువులు కావడం.. ఒకే గదిలో ఉండడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అనంతరం అంజలిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని మహేశ్వరి ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే సమయంలో మహేశ్వరి స్నేహితుడైన మంచిర్యాలకు చెందిన అజ్మీర శ్రీనివాస్ కు అంజలితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అంజలి అతడికి దగ్గరయ్యింది. దీంతో అంజలి, మహేశ్వరిల మధ్య దూరం పెరిగి.. గొడవలకు దారి తీశాయి. శ్రీనివాస్‌తో ఉన్న చనువును తగ్గించుకోవాలని మహేశ్వరి తరచూ సూచిస్తుండేది. అయినప్పటికే అంజలి వినకపోవడంతో… ఆమెను మహేశ్వరి చంపాలని నిర్ణయించుకుంది.
పథకం ప్రకారం హత్య..
ఈనెల 15న ఊరికి వెళ్దామని అంజలిని మహేశ్వరి నమ్మించింది. పథకం ప్రకారమే ఆ రోజు రాత్రి ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బయలు దేరారు.. గుడిపెల్లి శివారు వరకు రాగానే నీతో మాట్లాడాలి.. అంటూ.. అంజలిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లింది. అప్పటికే తన వెంట తీసుకువెళ్లిన కత్తితో అంజలిపై మహేశ్వరి ఒక్కసారిగా దాడి చేసి హత్య చేసింది. అనంతరం తాను గాయాలు చేసుకుని మిత్రులకు ఫోన్ చేసింది. ఇదంతా పోలీసుల దృష్టి మరల్చేందుకు మహేశ్వరి పన్నాగం పన్నింది. ఇద్దరికీ గొడవ జరిగిందని.. ఆత్మరక్షణలో కత్తితో అంజలిని పొడిచినట్లు మహేశ్వరి పోలీసులకు చెప్పింది. ఇక దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేశ్వరి ప్లాన్ ప్రకారమే హత్య చేసిందని వారు తేల్చారు. ప్రేమను తిరస్కరించినందరే మహేశ్వరి హత్య చేసిందని తెలియడంతో పోలీసులు షాక్‌కి గురయ్యారు. నిందుతురాలిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.